ఏపీలో పంచాయతీ ఉప ఎన్నికలు ముగిశాయి. అయితే ఈ ఉప ఎన్నికల్లో జరిగిన స్థానాలన్నీ అధికార వైసీపీకి చెందినవే. రెండున్నర ఏళ్ల కిందట పంచాయతీ ఎన్నికలు జరిగాయి. చాలాచోట్ల సభ్యుల మరణం, వివిధ కారణాలతో రాజీనామాలతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. మొత్తం 26 జిల్లాల్లో 1001 వార్డు సభ్యులు, 64 సర్పంచ్ స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. అందులో 756 వార్డు సభ్యుల స్థానాలు, 30 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా వాటికి పోలింగ్ జరిగింది.
వైసీపీ ఒకవైపు,మరోవైపు టిడిపి 34 సర్పంచ్ స్థానాల్లో అత్యధికం తమకే లభించాయని ప్రకటనలు జారీ చేస్తున్నాయి. సంబరాలు చేసుకుంటున్నాయి. దీంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. వైసీపీ అనుకూల మీడియా ఒకలా… టిడిపి అనుకూల మీడియా మరోలా కథనాలు వండి వారిస్తుండడంతో ఒక రకమైన గందరగోళం నెలకొంది. వాస్తవానికి సర్పంచ్ ఎన్నికలు పార్టీలకు రహితంగా జరుగుతాయి. ఇక్కడ పార్టీ గుర్తు కనిపించదు.
మొత్తం 243 వార్డు స్థానాలతో పాటు 34 సర్పంచులకు పోలింగ్ జరిగింది. ఇందులో 22 మంది సర్పంచులు అధికార వైసీపీ మద్దతుదారులుగా గెలిచారు. మరొకచోట రెబల్ అభ్యర్థి విజయం సాధించారు. పది చోట్ల మాత్రం విపక్షాలు గెలుపొందాయి. ఇందులో 8 సర్పంచ్ స్థానాలను టిడిపి నేరుగా కైవసం చేసుకుంది.జనసేన మద్దతుతో మరో రెండు చోట్ల మాత్రం గెలుపొందింది.
అధికార వైసిపి గెలుచుకున్న స్థానాలను పక్కన పెడితే… విపక్షాలు విజయం సాధించిన సర్పంచ్ స్థానాలను పరిశీలిద్దాం.. శ్రీకాకుళం జిల్లా బొప్పడం, నెల్లూరు జిల్లా లింగరాజు అగ్రహారం,అనకాపల్లి జిల్లా కొరుప్రోలు, అల్లూరి సీతారామరాజు జిల్లా శోభకోట,ప్రకాశం జిల్లా పాకాల, పశ్చిమగోదావరి జిల్లా కావలిపురం, అనంతపురం జిల్లా జంగంపల్లిలో టిడిపి మద్దతుదారులు గెలుపొందారు. బాపట్ల జిల్లా మున్నంగి వారి పాలెం పంచాయితీని టిడిపి,జనసేన సంయుక్తంగా గెలుచుకుంది. ఇక వార్డు స్థానాలకు సంబంధించి టిడిపి మద్దతుదారులు 90 చోట్ల, జనసేన మద్దతుదారులు ఐదుచోట్ల, తిరుగుబాటు అభ్యర్థులు రెండు చోట్ల, ఇతరులు నాలుగు చోట్ల మరియు అధికార పార్టీ వైసీపీ మద్దతుదారులు 141చోట్ల గెలుపొందారు.
అయితే ఒకటి మాత్రం నిజం. అధికార వైసిపి పై స్పష్టమైన వ్యతిరేకత కనిపించింది. అంతకుముందు ఏకగ్రీవాలు చేసుకున్న చోట్ల కూడా బలవంతంగానే చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఒకటి రెండు చోట్ల విధ్వంసం కూడా చోటుచేసుకుంది. నిన్నటి పోలింగ్ లో కూడా ప్రలోభాలు వెలుగు చూశాయి. అయినా విపక్షాల మద్దతుదారులు పెద్ద ఎత్తున గెలుపొందడం విశేషం. పంచాయితీ ఉప ఎన్నికల్లో ఇప్పటికైనా అధికార పార్టీ ఫలితాలపై విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.