భార్యపై అనుమానం పెంచుకొని హతమార్చిన ఉపాధ్యాయుడు

భార్యపై అనుమానం పెంచుకొని హతమార్చిన ఉపాధ్యాయుడు

విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే భార్యపై అనుమానం పెంచుకొని హతమార్చిన ఘటన ఆర్మూర్‌ మున్సిపల్‌పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌హెచ్‌వో రాఘవేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని కొటార్మూర్‌లో సోమవారం రాత్రి పాతకాల నాగమణి అలియాస్‌ పావని(36)ని భర్త ముతన్న విచక్షణ రహితంగా కొట్టి హతమార్చాడు. ముత్తన్నకు, నాగమణికి 16 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. మృతురాలు నాగమణి సిరికొండ మండలం న్యావనంది ప్రభుత్వ పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంటుగా, ముత్తెన్న మెంట్రాజ్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంటుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

భర్త ముత్తెన్న గతం కొంతకాలంగా భార్యను అనుమానంతో వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఇద్దరి మధ్య గొడవలు పరాకాష్టకు చేరుకోగా నాగమణి పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదు. కాగా సోమవారం పెద్దమనుషులు ఇద్దరి మధ్య సఖ్యత కుదిరేలా మాట్లాడి పంపించారు. ఇంటింటికి వచ్చిన అనంతరం ఇద్దరి మధ్య మళ్లీ గొడవ కావడంతో ముత్తెన్న భార్యను విచక్షణ రహితంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గాయాలపాలైన భార్యను ముత్తెన్న జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు.నాగమణి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లి గంగు ఫిర్యాదు మేరకు ముత్తెన్నపై హత్య నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.