అనామకుడు కాదు.. చదువు సంధ్య లేని వాడు అంతకంటే కాదు. సమాజంలో తనకంటూ ఓ గుర్తింపుతో ఉత్తముడిలా చలామణి అవుతున్న వ్యక్తి. అయితే కామంతో కళ్లు మూసుకుపోయి కన్నబిడ్డలాంటి విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. వ్యాయామ విద్యతో విద్యార్థుల శారీరక దృఢత్వానికి బాటలు వేయాల్సిన ఉపాధ్యాయుడే వక్ర బుద్ధిని చూపించాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన వివరాలు ఇలా.. బొమ్మనహాళ్ మండలం శ్రీధరఘట్టలోని జెడ్పీ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు రెండు రోజుల క్రితం పదో తరగతి విద్యార్థిని ఇంటిలో ఉన్న సెల్‌ఫోన్‌కు కాల్ చేశాడు.
అతని మాట తీరుపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పరిశీలించడంతో అసలు విషయం వెలుగు చూసింది. వాట్సాప్‌లో ఆడియో చాటింగ్‌లో వ్యాయామ ఉపాధ్యాయుడి మాటలు ఉన్నాయి. తన భార్యకు ఏడాదిగా ఆరోగ్యం సరిగా లేదని, పాఠశాలలోని తన గదిలోకి ఒంటరిగా వచ్చి తన కోరిక తీరిస్తే ఏమి కావాలన్నా తాను చూసుకుంటాననే ఉపాధ్యాయుడి మాటలు విన్న తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న వెంటనే వ్యాయామ ఉపాధ్యాయుడు అత్యవసరంగా సెలవు పెట్టి మరో ప్రాంతానికి వెళ్లిపోయాడు. ప్రధానోపాధ్యాయుడి దృష్టికి కామాంధుడి వైఖరిని తల్లిదండ్రులు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యాయామ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమ బాట పడతామంటూ హెచ్చరికలు జారీ చేశారు.