ప్రేమ పేరుతో మోసం చేసిన అధ్యాపకుడు

ప్రేమ పేరుతో మోసం చేసిన అధ్యాపకుడు

యువతిని వేధిస్తున్న ఘటనలో ఓ అధ్యాపకుడిని అరండల్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. వివాహితుడైన ఆ అధ్యాపకుడు ప్రేమ పేరుతో గతంలో యువతిని మోసం చేసి, అరెస్టయ్యాడు. బెయిల్‌పై వచ్చి తిరిగి వేధిస్తుండడంతో పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. అరండల్‌పేట ఎస్‌ఐ ఎస్‌.రవీంద్ర కథనం మేరకు.. స్తంభాలగరువు ఎల్‌ఐసీ కాలనీ ఒకటో లైనుకు చెందిన చిలికా శ్రీనివాసరావు బ్రాడీపేటలో ఇంగ్లిష్‌ కోచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తుండేవాడు. అతడికి గతంలోనే వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. అయితే ఓ బీఈడీ కళాశాలలో చదువుతున్న ఓ యువతి శ్రీనివాసరావు వద్ద ఇంగ్లిష్‌ కోచింగ్‌ తీసుకునేది. ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను శ్రీనివాసరావు ప్రేమపేరుతో నమ్మించి నిశ్చితార్థం చేసుకుని రూ.2 లక్షలు తీసుకున్నాడు.

అనంతరం తాను వివాహితుడినని చెప్పి పెళ్లికి నిరాకరించాడు. యువతిని శారీరకంగా, మానసికంగా వేధించాడు. యువతి ఫిర్యాదుతో పోలీసులు శ్రీనివాసరావును అరెస్టు చేసి రిమాండుకు పంపారు. ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చిన శ్రీనివాసరావు తిరిగి యువతిని వేధించడం మొదలు పెట్టాడు. యువతి పుట్టిన రోజునాడు కేకులు కోసి ఫొటోలు సోషల్‌ మీడియాలో పెట్టడం, పెళ్లి చేసుకోవాలని వత్తిడి తెస్తున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం యువతి ఇంటికి వెళ్లి ఆమెను, ఆమె తల్లిని దుర్భాషలాడాడు. యువతికి వివాహం కాకుండా చేస్తానని బెదిరించాడు. యువతి ఫిర్యాదుతో శ్రీనివాసరావును పోలీసులు సోమవారం మరోసారి అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.