దేశంలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలకలం సృష్టించింది. ఢిల్లీలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థి, టీచర్‌కు కరోనా టెస్టుల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం మిగతా విద్యార్థులను స్కూల్ నుండి ఇంటికి పంపించారు.కాగా, ఢిల్లీలో బుధవారం ఒక్కరోజే 299 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
కోవిడ్ పాజిటివిటీ రేటు 0.5 నుంచి 2.70కు పెరిగింది. తాజాగా కేసులతో కలిపి ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య 18,66,881కి పెరిగింది. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అతిషి మాట్లాడుతూ.. విద్యార్థి, టీచర్‌కు పాజిటివ్ అని తేలడంతో మిగతా విద్యార్థులను ఇంటికి పంపినట్టు తెలిపారు. రెండేళ్ల తర్వాత ఆఫ్‌లైన్ క్లాసులు జరుగుతున్నాయని అన్నారు. కానీ, పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మళ్లీ ఆందోళన నెలకొందన్నారు.
ఆన్లైన్ క్లాసుల వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అంతకు ముందు నోయిడా, ఘజియాబాద్‌లోని పాఠశాలల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. నోయిడాలోని నాలుగు పాఠశాల్లో 23 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఘజియాబాద్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో గత వారం ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్ అని తేలడంతో ముందుజాగ్రత్త చర్యగా పాఠశాలను మూడు రోజుల పాటు మూసివేశారు.