తొలిటెస్ట్‌లో టీమిండియా విక్టరీ

Team India grand victory in first test

వెస్టిండీస్‌ పై జరిగిన తొలి టెస్టులో 318 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయాన్ని సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌ లో రహానే, జడేజా బ్యాటింగ్ లంబూ బౌలింగ్‌తో పట్టు బిగించిన భారత్, రెండో ఇన్నింగ్స్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కరేబియన్లను మట్టి కరిపించి ప్రపంచ కప్‌ మొదటి మ్యాచ్‌లో బోణీ కొట్టింది.

రెండో ఇన్నింగ్స్‌లో కరేబియన్లను వంద పరుగులకే కట్టడి చేసి భారీ విజయాన్ని దక్కించుకుంది. భారత పేసర్ల దూకుడుకు విండీస్‌ కకావికలమైపోయింది. విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తయడంతో ఏకంగా 318 పరుగుల తేడాతో తొలి టెస్ట్‌ గెలిచింది భారత్. నాల్గోరోజు కూడా టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

కోహ్లీ వెంటనే ఔటయినప్పటికీ, రహానె జోరు కొనసాగించి సెంచరీ బాదేశాడు. విరాట్ ఔట్ తర్వాత క్రీజులోకి వచ్చిన హనుమ విహారితో కలిసి నిలకడగా ఆడిన రహానె ఐదో వికెట్‌కి 135 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో.. భారత్ జట్టు అలవోకగా 300 పైచిలుకు స్కోరు చేయగలిగింది.

సెంచరీ తర్వాత అజింక్య రహానె దూకుడుగా ఆడబోయి వికెట్ చేజార్చుకోగా క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ మరోసారి తేలిపోయాడు. భారీ టార్గెట్ సెట్ చేసిన తరుణంలో హనుమ విహారి అనవసర షాట్‌తో 93 పరుగులతో సెంచరీ మిస్సయ్యాడు.

వెంటనే కెప్టెన్ విరాట్ కోహ్లి భారత్ ఇన్నింగ్స్‌ని ఏడు వికెట్ల నష్టానికి 343 పరుగుల వద్ద డిక్లేర్ చేశాడు. భారత్‌ నిర్దేశించిన 419 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో వెస్టిండీస్‌ దారుణంగా విఫలమైంది. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన రహానేకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు దక్కింది.