చరిత్ర సృష్టించి తల్లికి గిఫ్ట్ ఇచ్చిన సింధు 

Sindhu made history and gift to mother

తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరపై 21-7, 21-7 తేడాతో  ఘనవిజయం సాధించింది. తొలి రౌండ్‌లో అదరగొట్టిన పీవీ సింధు రెండో రౌండ్‌లోనూ దూసుకెళ్లింది.

రెండో గేమ్‌లోనూ ఆదినుంచే పాయింట్లు సాధిస్తూ ఒకుహరపై పైచేయి సాధించింది. 2వ పాయింట్‌ నుంచి 9 పాయింట్ల వరకు వరుసగా చెలరేగింది. మధ్యలో ఒకుహర  రెండు పాయింట్లు సాధించినా సింధూ మళ్లీ జోరు కొనసాగించింది. ఇక బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ విజేత పీవీ సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

మహిళల సింగిల్స్‌ ఫైనల్లో అద్వితీయ ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించిన ఆమెకు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ గవర్నర్‌ హరిచందన్‌, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, బీజేపీ, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులతో పాటు క్రీడాకారులు, బాలీవుడ్‌, టాలీవుడ్‌ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.

పీవీ సింధును చూసి భారత్‌ మరోసారి గర్విస్తోందంటూ ప్రధాని ట్వీట్‌ చేశారు.  ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ కైవసం చేసుకున్న భారత స్టార్‌ షట్లర్ పీవీ సింధు ఇంట్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. సింధు తల్లి విజయ, ఇతర కుటుంబసభ్యులు టీవీలో మ్యాచ్‌ను వీక్షించారు.

సింధు విజయం సాధించిన అనంతరం వారంతా ఒకరినొకరు అభినందించుకుంటూ మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. సింధు క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో చైనీస్‌ తైపీ క్రీడాకారిణిపై గెలవడం టర్నింగ్‌పాయింట్‌ అని సింధు తల్లి వివరించారు. ఆ మ్యాచ్‌లో తొలి సెట్‌లో సింధు సరిగా రాణించలేదని అయితే మిగతా రెండు సెట్లలో తిరిగి పుంజుకుని సత్తా చాటిందని అన్నారు.

ఫైనల్‌లో ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఆడిందని ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ టైటిల్‌ కోసం సింధు గత ఆరునెలలుగా తీవ్రస్థాయిలో సాధన చేసిందని తెలిపారు. ‘‘ప్రతిసారీ నా పుట్టినరోజున సింధు ఏదో ఒక బహుమతి ఇచ్చేది. ఈసారి నాకు, ఈ దేశానికి చాలా పెద్ద బహుమతి ఇచ్చింది’’ అని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజే సింధు తల్లి విజయ పుట్టినరోజు కావడం విశేషం.