సిడ్నీ: విరాట్ కోహ్లి సారథ్యంలో ఆడేందుకు టీమిండియా ఆటగాళ్లు భయపడతారని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ లీ పేర్కొన్నాడు. అదే సమయంలో అజింక్య రహానే కెప్టెన్సీలో మాత్రం స్వేచ్ఛగా ఆడతారని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ తాను భారత జట్టు సెలక్టర్ అయితే కోహ్లిని బ్యాటింగ్‌పై మరింతగా దృష్టి సారించమని సలహా ఇస్తానని, రహానేకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తానని పేర్కొన్నాడు. కాగా ఆసీస్ టూర్లో భాగంగా తొలి టెస్టు ఘోర పరాజయం తర్వాత రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి పితృత్వ సెలవుపై స్వదేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సారథ్య బాధ్యతలు చేపట్టిన రహానే తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.
సీనియర్ ఆటగాళ్లు లేకపోయినా యువ క్రికెటర్లతోనే అద్భుతం చేసి చిరస్మరణీయ విజయం సొంతం చేసుకున్నాడు. తద్వారా బోర్డర్- గావస్కర్ ట్రోఫీని టీమిండియా నిలబెట్టుకోగలిగింది. దీంతో రహానే నాయకత్వ లక్షణాలపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో షేన్ లీ తన అన్నయ్య బ్రెట్ లీతో జరిగిన సంభాషణలో ఈ విషయాలను ప్రస్తావించాడు. ‘‘గొప్ప బ్యాట్స్మెన్లలో కోహ్లి పేరు ఎల్లప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక కెప్టెన్‌గా ఉన్నందున టీమిండియా సభ్యులకు అతడంటే విపరీతమైన గౌరవం ఉంటుంది. అయితే అదే సమయంలో అతడికి వారు భయపడినట్లు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే కోహ్లి ప్రొఫెషనలిజంకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు.
కచ్చితమైన ఫలితాలు కావాలంటాడు. రహానే ఈ అంశాలకు విలువనిస్తూనే ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడేలా స్వేచ్ఛనిస్తాడు’’ అని పేర్కొన్నాడు. నేను గనుక టీమిండియా సెలక్టర్ అయితే రహానేను సారథిని చేసి, కోహ్లి కేవలం బ్యాటింగ్‌పై ఫోకస్ చేసే అవకాశం ఇస్తాను. కోహ్లి జోష్‌లో ఉంటే జట్టు కూడా అదే స్థాయిలో మెరుగ్గా రాణిస్తుంది. అయితే ఇలాంటి ఒక పరిణామం జరుగుతుందా లేదా అన్న విషయాన్ని కాలమే నిర్ణయిస్తుంది అని షేన్ లీ చెప్పుకొచ్చాడు. కాగా ఆసీస్ తరఫున షేన్ లీ 45 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఇక టీమిండియా ప్రస్తుతం విరాట్ కోహ్లి నేతృత్వంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతోంది.