టెక్నికల్ సపోర్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మీ చింతలు తీరుస్తామంటూ చిక్కుల్లో పడేస్తున్నారు. ముఖ్యంగా ఇండియాలో ఈ తరహా నేరాలు భారీగా జరుగుతున్నాయి. సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థలు విడుదల చేసిన తాజా గణాంకాలు ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.
ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే టెక్ సపోర్ట్ పేరుతో మెసాలకు పాల్పడుతున్న 2,00,00ల మంది సైబర్ నేరగాళ్లను గుర్తించామంటూ ప్రముఖ టెక్ సర్వీసెస్ సంస్థ అవాస్ట్ పేర్కొంది. ఇలా గుర్తించిన వారందరినీ బ్లాక్ చేయడం చేసినట్టు తెలిపింది.
సైబర్ నేరగాళ్లు టెక్ సపోర్ట్ పేరుతో వల వేస్తున్నారు. సామాన్యుల కంప్యూటర్లతో యాక్సెస్ దొరకగానే … మాల్వేర్లను చొప్పిస్తున్నారు. అనంతరం డేటాను దొంగిలిస్తున్నారు. కొన్నిసార్లు సిస్టమ్ మొత్తం క్రాష్ అయ్యేలా హానికరమైన మాల్వేర్ను సైతం పంపిస్తున్నారు. దీంతో వీరి వలలో పడినవారు తీవ్రంగా నష్టపోతున్నట్టు అసలైన టెక్సపోర్ట్ సంస్థలు వెల్లడిస్తున్నాయి.
టెక్ సపోర్ట్ పేరుతో ఫోన్లు చేయడం, మెసేజ్‌లు పంపడం ద్వారా కంప్యూటర్ యూజర్లతో సైబర్ నేరగాళ్లు కాంటాక్ట్‌లోకి వస్తున్నారు. కంప్యూటర్, ల్యాప్‌టాప్ లేదా ట్యాబ్‌లో సమస్య ఉందని దాన్ని పరిష్కరించుకోవాలంటూ సూచిస్తారు. తమ టెక్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్లను వాడితే సమస్య దూరమైపోతుందంటూ నమ్మిస్తున్నారు. ఆ వెంటనే తమ ప్రణాళికను అమల్లో పెడుతున్నారు.
కంప్యూటర్లలో విలువైన సమాచారం చేతికి వచ్చిన తర్వాత కొందరు నేరగాళ్లు బ్యాంకు ఖాతాల ఆధారంగా ఆర్థిక నేరాలకు పాల్పడుతుంటే మరికొందరు వ్యక్తిగత సమాచారం ఆధారంగా బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారు. ఆన్లైన్ టెక్ సపోర్ట్ పేరుతో సంప్రదించే నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ సైబర్ సెక్యూరిటీ సంస్థలు సూచిస్తున్నాయి.