అతడు టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఆమె ఓ కార్పోరేట్ స్కూల్‌లో టీచర్. ఇద్దరూ ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతిఫలంగా ఏడేళ్ల కుమార్తె. సొంత ఇల్లు.. సంసారం సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబంలో ఏం జరిగిందో తెలీదు గానీ.. ఉన్నట్లుండి పాపతో కలిసి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మృతుల నుదుట బొట్లు, దేవుని గదిలో పటాలు చిందరవందరగా పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. పనిమనిషికి రెండు రోజుల ముందే రావద్దని చెప్పడంతో ముందే ఆత్మహత్యకు పథకం రచించుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంగారెడ్డి అమీన్‌పూర్ బీరంగూడలో కుటుంబం ఆత్మహత్య ఘటనలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం తూంకుంట మున్సిపల్ పరిధి పోతాయిపల్లికి చెందిన తిగుళ్ల శ్రీకాంత్‌గౌడ్ పదేళ్ల క్రితం అల్వాల్ వెంకటాపురానికి చెందిన అనామిక ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి శ్రీస్నిగ్ధ సంతానం. ఏడేళ్ల క్రితం బీరంగూడలోని వందనపురి కాలనీలో ఇల్లు కొనుగోలు చేసి ఇక్కడే నివాసముంటున్నారు. అనామిక తండ్రి శ్రీరామచంద్రమూర్తి రెండు రోజులుగా ఫోన్ చేసినా సమాధానం లేకపోవడంతో ఆయన గురువారం కుమార్తె ఇంటికి వచ్చారు.
లోపలి నుంచి గడియపెట్టి ఉంది. ఎంత పిలిచినా ఎవరూ స్పందించకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా శ్రీకాంత్‌గౌడ్ ఉరి వేసుకుని ఉన్నట్లు కనిపించాడు. దీంతో ఆయన వెంటనే అమీన్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్‌ఐ రాజేందర్‌రెడ్డి తమ సిబ్బందితో అక్కడికి వచ్చి తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి పరిశీలించారు. శ్రీకాంత్‌గౌడ్ ఉరి వేసుకుని కనిపించగా.. భార్య అనామిక, కూతురు శ్రీస్నిగ్ధ పురుగుల మందు తాగి నోటి నుంచి నురుగు, ముక్కుల నుంచి రక్తం వచ్చి మృతి చెందారు.
ప్రమాద స్థలంలో కనిపించిన ఆధారాలను బట్టి శ్రీకాంత్ గౌడ్ ముందుగా భార్యకు, కూతురికి విషం ఇచ్చి వారు చనిపోయిన తరువాత మృతదేహాలపై దుప్పటి కప్పి, అనంతరం వారిద్దరికీ పెద్ద బొట్లు పెట్టి తానూ పెట్టుకుని మరో గదిలోకి వెళ్లి ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని, కారణాలు తెలియరాలేదని సీఐ తెలిపారు. అయితే శ్రీకాంత్ గౌడ్ తల్లిదండ్రులు బాల్‌రాజ్ గౌడ్, సత్తమ్మలు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెబుతున్నారు.