ఈ టెక్నిక్ పనిచేస్తుందా.. డీజే సౌండ్ కి మిడతలు పరార్..

ప్రస్తుతం ఇండియాపై మిడతలు దాడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు రాష్ట్రాలపై అటాక్ చేస్తున్న ఈ మిడతల దండు తాజాగా తెలంగాణలోకి ప్రవేశించే విషయంపై కూడా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ మిడతలను తరిమికొట్టే విధానాలేవీ ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. దీంతో రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు శ్రమించి పండించిన పంట కళ్ల ముందే నాశమవుతుంటే.. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

అదే విధంగా కొంతమంది రైతులు మాత్రం మిడతల దండును తరిమికొట్టేందుకు సరికొత్తగా ప్రయత్నాలు చేస్తున్నారు. పెళ్లిల్లో ఉపయోగించే డీజే వాహనం (భారీ స్పీకర్లు కలిగిన వాహనం)తో మిడతలను తరిం కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే.. డీజే స్పీకర్ల నుంచి వెలువడే భారీ శబ్దాలకు ఆ మిడతలు తోక ముడిచి పారిపోతున్నాయని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ పోలీస్ అధికారి రాహుల్ శ్రీవాస్తవ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఈ మిడతలను తరిమేందుకు డీజే స్పీకర్లే కాకుండా చప్పట్లు, పెద్ద పెద్ద శబ్దాలు కూడా చేయ వచ్చని ఆయన తెలిపారు. గత 26 ఏళ్లల్లో ఎన్నోసార్లు ఈ మిడతల దండు మన దేశంలోకి వచ్చాయి. కానీ.. ఇంత భారీ సంఖ్యలో దాడి చేయడం ఇదే తొలిసారని నిపుణులు తమ అబిప్రాయాలను వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ దండు ఇప్పుడు తెలంగాణ వైపుకు వస్తుండటంతో ఇప్పడీ ఐడియా ఇక్కడ ప్రయోగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.