‘ఇది దారుణమైన బడ్జెట్. దూరదృష్టి లేని కురచ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండటం దరిద్రం. బడ్జెట్‌లో రైతులు, పంటలకు కనీస గిట్టుబాటు ధర ప్రస్తావనే లేదు. పైగా రూ.12,708 కోట్ల యూరియా సబ్సిడీ, రూ.22192 కోట్ల ఇతర ఎరువుల సబ్సిడీలు కలిపి మొత్తం రూ.34,900 కోట్ల సబ్సిడీలను తగ్గించారు. 2022 నాటికి రైతుల ఆదా యం రెట్టింపు చేస్తామనే హామీ ఏమైంది? రైతు ల పరిస్థితే బాగుంటే ఏడాది పాటు ఎండావానల్లో ఆందోళన ఎందుకు చేశారు? ఓ వైపు దేశంలో నిరుద్యోగం తీవ్రంగా పెరిగిపోతే, గ్రా మీణ ఉపాధి హామీ పథకానికి రూ.25 వేల కో ట్లు కోత పెట్టారు.
కేంద్ర విద్యుత్ విధానం మెం టల్ కేస్‌లాగా ఉంది..’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో కేసీఆర్ కేంద్ర బడ్జెట్‌పై మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..దేశ ప్రజానీకం ఆయన ప్రభుత్వానికి పదేళ్ల కాలానికి తీర్పునిస్తే ఇప్పటికే 80 శాతం సమయం పూర్తయింది. 116 దేశాల ప్రపంచ హంగర్ ఇండెక్స్‌లో నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ కంటే భారత్ అధ్వాన్న స్థితిలో 101వ స్థానంలో ఉంది. అయినా బడ్జెట్‌లో ఆహార సబ్సిడీని రూ.65 వేల కోట్లు తగ్గించారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు అనే నినాదం పెద్ద బోగస్. గతంలో క్రిప్టో కరెన్సీని అనుమతించమని చెప్పి ఇప్పుడు క్రిప్టో కరెన్సీ మీద 30 శాతం పన్నులు ఎలా వేస్తారు?
మిషన్ భగీరథ పథకానికి 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ రూ.40 వేల కోట్లు ఖర్చు చేసింది.140 కోట్ల దేశ జనాభాకు రూ.60 కోట్లతో జలశక్తి మిషన్ అట. ఇలాంటి అబద్ధాలు చెప్పేటపుడు మంత్రి నిర్మల ఆత్మ ఘోషించలేదా. పచ్చి అబద్ధాలకు మహా భారతంలోని శాంతి పర్వం శ్లోకాన్ని వాడుకుంటారా? మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని చెప్పుకునే దరిద్రులు బీజేపీ నేతలు. కేసీఆర్ కిట్ పథకంలో ఇస్తున్న నిధుల్లో రూ.6 వేలు తమవే అని చెప్పుకుంటున్నారు. చినజీయర్ స్వామి ఆశ్రమంలో రామానుజాచార్యుల సమతా మూర్తి నిర్మాణం కూడా తమ ఘనత అని ప్రచారం చేసుకుంటున్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చేది గుండు సున్నా. మన దగ్గర నుంచి వెళ్లే నిధులతోనే కేంద్రం బతుకుతోంది. మన సొమ్ములతో వాళ్ల సోకులు పడుతున్నారు. దేశాన్ని సాకుతున్న ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి.
హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్న నా విజ్ఞప్తికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అంగీకరించారు. రూ.300 కోట్ల విలువ చేసే భూమిని కేటాయించి ఈ నెల 5న చీఫ్ జస్టిస్ చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహిస్తున్నాం. హైదరాబాద్‌లో ఆరిట్రేషన్ సెంటర్ ఏర్పాటుతో నిద్రపట్టని ప్రధాని మోదీ దాన్ని అహ్మదాబాద్‌కు తరలించాలని సుప్రీం కోర్టుపై ఒత్తిడి చేశారు. సాధ్యం కాకపోవడంతో ప్రస్తుత బడ్జెట్‌లో గిఫ్ట్ సిటీ లో అలాంటి శిఖండి ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ప్రతిపాదించారు. ఆయన దేశానికి కాదు గుజరాత్‌కు ప్రధానిలా వ్యవహరిస్తున్నారు. తెలుగువారి కోడలు అయిన నిర్మలా సీతారామన్ ఈ విషయంలో ఆత్మద్రోహం చేసుకున్నారు.
నదుల అనుసంధానం మిలీనియం జోక్. కృష్ణా, గోదావరి, కావేరీ నదుల అనుసంధానం చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఏ అధికారంతో చేర్చారు. మా సమ్మతి లేకుండా కావేరీలో ఏ చట్టం ప్రకారం కలుపుతారు. ఒకవేళ గోదావరిలో మిగులు జలాలు ఉంటే తెలంగాణ ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఎందుకు ఆమోదించడం లేదు.కేంద్రంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే తెలంగాణలో ధర్నాలు చేస్తామని ప్రచారం చేస్తున్నారు. వారికి నెత్తీ కత్తీ రెండూ లేవు. కొత్త జోనల్ విధానంతో స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు వస్తాయి. అర్బన్ జిల్లాల యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలనే 317 జీవో తెచ్చాం. ఎక్కడివారికి అక్కడే ఉపాధి, ఉద్యోగం, సంక్షేమం అందాలన్నదే మా విధానం. జర్నలిస్టులు, ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాల కేటాయింపు కేసు ఈ నెలాఖరులో ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నాం. ప్రత్యేక చట్టం తీసుకువచ్చి త్వరలోనే స్థలాలిస్తాం.