వచ్చే నెల 21 నుంచి 28 వరకు జరగనున్న యాదాద్రి ఆలయ ఉద్ఘాటన పనులను సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం యాదాద్రిని సందర్శించారు. ప్రత్యేక హెలికాప్టర్ లో సీఎం కేసీఆర్.. యాదాద్రికి చేరుకున్నారు. బాలాలయంలో స్వామివారిని దర్శనం చేసుకున్న కేసీఆర్.. ఆపై ఆలయ పునః నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు.
యాదాద్రి ఆలయాన్ని ఏరియల్ వ్యూ ద్వారా సీఎం కేసీఆర్ పరిశీలించారు. ప్రధానాలయం, కోనేరు, రోడ్లను కేసీఆర్ పరిశీలించారు. అనంతరం కాలినడకన ఆలయం చుట్టూ తిరిగి పలు సూచనలు చేశారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి జగదీశ్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, టీఆర్ఎస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులుతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.
మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ దృష్ట్యా.. సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లపై ఆలయ పండితులు, అధికారులతో కేసీఆర్ సమీక్షించి, పలు సూచనలు చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో యాదాద్రిలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆలయ ప్రాంగణంతోపాటు టెంపుల్ సిటీ, కాటేజీల నిర్మాణాలు, విద్యుదీకరణ, కల్యాణ కట్ట, దీక్షాపరుల మండపం, అన్నప్రసాదం, వ్రత మండపం, గండి చెరువు సుందరీకరణ, బస్ టెర్మినళ్ల వంటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.
ప్రధానాలయంలో పరంజాలు కడుతుండగా బస్‌బేలు, సత్యనారాయణ వ్రత మండపం, అన్నదాన కేంద్రానికి శ్లాబులను ఏర్పాటు చేస్తున్నారు. పుష్కరిణి, దీక్షాపరుల మండపం పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రధానాలయానికి స్వాగత తోరణం, ఫ్లైఓవర్ల పనులు జరుగుతున్నాయి. మెట్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది.