టీ కాంగ్రెస్ షాకింగ్ డెసిషన్…!

Telangana Congress Leaders Fighting For Cm Chair

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగింది ప్రజాకూటమి. అయితే, రాష్ట్రంలోని ఓటర్లు మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితికి జై కొట్టారు. కూటమి ఏర్పడక ముందు వరకు టీఆర్ఎస్‌దే విజయమన్న టాక్ వినపడింది. కానీ, టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా నాలుగు పార్టీలతో కలిసి ఏర్పడిన ప్రజాకూటమి మాత్రం బాగా బలపడింది. ఇక అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి-ప్రజాకూటమి మధ్య గట్టి పోటీ ఉంటుందని భావించారంతా. ముందస్తు ఎన్నికలు ఎంతో హోరాహోరీగా సాగినా ఫలితాలు మాత్రం వన్‌సైడే వచ్చాయి. రాష్ట్రంలోని 119 స్థానాలకు గానూ టీఆర్ఎస్‌కు 88 సీట్లు వచ్చాయి. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ప్రజాకూటమికి మాత్రం 21 స్థానాలే దక్కాయి. దీంతో కూటమిలోని అన్ని పార్టీలు సైలెంట్ అయిపోయాయి. అయితే, కూటమిలో పెద్దన్న పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం అడపాడపా మీడియా ముందుకు వచ్చి టీఆర్ఎస్ మోసం చేసి గెలిచిందని, తెలుగుదేశం పొత్తు వలెనే ఓడిపోయామంటూ అంటూ పలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఆ పార్టీ 2019 ఎన్నికల కోసం ఓ ప్లాన్ రెడీ చేసేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యమంత్రి రేసులో ఉన్నామంటూ చెప్పుకున్న చాలా మంది నేతలు ఘోర పరాభవాన్ని చవి చూశారు. ఇప్పుడు కొందరు ముఖ్యులను పార్లమెంట్ బరిలో దించాలని ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయించుకుందని సమాచారం. వారిలో మాజీ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డిల పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇందులో నల్లగొండ అసెంబ్లీ నుంచి ఓటమిపాలైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఓ అడుగు ముందుకేసి తాను నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి రేవంత్‌రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈయనతో పాటు డీకే అరుణ పేరు కూడా వినిపిస్తోంది. అలాగే ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి మాజీ ఎంపీ రమేశ్‌రాథోడ్, భువనగిరి నుంచి పొన్నాల, కరీంనగర్‌ పార్లమెంట్‌కు మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, నాగర్‌కర్నూలు నుంచి మల్లు రవి పోటీ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అనేది కొన్ని రోజుల్లో తేలనుంది.