చేపల కోసం బావిలోకి దిగి ప్రమాదంలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను ప్రాణాలకు తెగించి కాపాడిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డి మీద మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశంసల వర్షం కురిపించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లె గ్రామానికి చెందిన ఓ మంచి నీటి బావిలో గత వర్షాకాలంలో బావి యజమాని చేప పిల్లలను వదిలారు. అవి పెరిగి పెద్దవి కావడంతో మంగళవారం గ్రామానికి చెందిన మల్లయ్య (45), మారేపల్లి రవీందర్ (45) అనే వ్యక్తులు చేపల కోసం ఆ మంచినీటి బావిలో దిగారు. కొంతసేపటికే బావిలోని విష వాయువుల కారణంగా శ్వాస అందక అస్వస్థతకు గురయ్యారు. వారిద్దరూ అపస్మాకర స్థితికి చేరడంతో స్థానికులు 108కి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డి తన బృందంతో వెంటనే బావి వద్దకు చేరుకున్నారు. బావిలోకి దిగడానికి అందరూ భయపడుతున్న సందర్భంలో తానే స్వయంగా బావిలోకి దిగి బాధితులను రెప్పపాటు కాలంలో ప్రాణాలతో పైకి తీసుకొచ్చారు. దీంతో మల్లయ్య, రవీందర్ ప్రాణాలతో బయటపడ్డారు. సీఐ ధైర్య సాహసాల గురించి గ్రామస్థులు ద్వారా విషయం తెలుసుకున్న హరీశ్‌రావు సీఐ సృజన్ రెడ్డి సాహసాన్ని ప్రశంసిస్తూ నిన్న ట్వీట్ చేశారు.