Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగుదేశంతో రాజకీయ జీవితాన్ని ఆరంభించిన తెలంగాణ నేత మోత్కుపల్లి నోట అనూహ్యమైన మాట వచ్చింది. ఏ నోటితో అయితే కెసిఆర్ ని నానా మాటలు అన్నారో అదే నోటితో తెరాస లో టీడీపీ ని విలీనం చేస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ 22 వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన మోత్కుపల్లి తెలంగాణ లో టీడీపీ పరిస్థితి మీద తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణాలో పార్టీని కాపాడుకోడానికి ఎంత ప్రయత్నం చేసినా ఏ ఒక్కరూ సహకరించే పరిస్థితి లేదని వాపోయారు. ఇలా జరుగుతూ పోయి తెలంగాణాలో టీడీపీ కి ఉనికి లేదు అనిపించుకునే కన్నా తెరాస లో టీడీపీ ని విలీనం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు.
తెలంగాణాలో టీడీపీ పరిస్థితి చూసి ఆ పార్టీ నాయకులు తీవ్ర మానసిక క్షోభకు గురి అవుతున్నట్టు చెప్పారు మోత్కుపల్లి. తెరాస కూడా టీడీపీ నుంచి వెళ్లిన కె.చంద్రశేఖరరావు పెట్టిన పార్టీ కాబట్టి అందులో తెలుగుదేశాన్ని విలీనం చేస్తే మంచి జరుగుతుందని మోత్కుపల్లి అంటున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందని కూడా మోత్కుపల్లి అభిప్రాయపడ్డారు. మోత్కుపల్లి మాటలతో తెలంగాణ లో తీవ్ర సంచలనానికి దారి తీశాయి. టీడీపీతో పొత్తుకు తెరాస ప్రయత్నం చేయొచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో ఇలా మోత్కుపల్లి లాంటి సీనియర్ నాయకుడు ఏకంగా విలీనం ప్రస్తావన తేవడంతో ఎన్టీఆర్ ట్రస్ట్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పార్టీ వదిలిపెట్టి వెళ్లే నేతలు చేసే కామెంట్స్ కన్నా నేడు మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.