సోలార్ విద్యుదుత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని ఈ– సిటీలో ప్రీమియర్ ఎనర్జీస్ 750 మెగావాట్ల సోలార్ పీవీ సెల్స్, మాడ్యూల్స్ కంపెనీని గురువారం మంత్రి పి.సబితారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత ఏడాది ఒకే సంవత్సరంలో రాష్ట్రంలో రూ.22 వేల కోట్ల పెట్టుబడులతో 17,000 పరిశ్రమలను తీసుకువచ్చినట్టు గుర్తు చేశారు. ఇందులో 80 శాతం కంటే ఎక్కువ ప్రస్తుతం పని చేస్తున్నాయన్నారు.
కరోనా సమయంలో రూ.483 కోట్లతో ప్రీమియర్ కంపెనీని నిర్మించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ కంపెనీ ద్వారా 700 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు.మరో రెండేళ్లలో 2,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాల కల్పన కోసం రూ.1,200 కోట్లను పెట్టుబడి పెడతామన్నారు. రంగారెడ్డి జిల్లాలో యువత నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఆగస్టు 5న ప్రారంభించనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో మరిన్ని కంపెనీల ఏర్పాటును స్వాగతిస్తున్నామని చెప్పారు. మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గంలో ఇంత పెద్ద పరిశ్రమ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పరిశ్రమల శాఖ కమిషనర్ జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, ప్రీమియర్ ఎనర్జీస్ వ్యవస్థాపకుడు చిరంజీవ్ శాలుజా, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కలెక్టర్ అమయ్‌కుమార్, అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్, మాజీ డీజీపీ తేజ్‌దీప్‌కౌర్, డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్ కారంపూడి విజయ్, మున్సిపల్ చైర్మన్ కాంటేకర్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవాని వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని ఈ–సిటీలో ప్రీమియర్ ఎనర్జీస్ పరిశ్రమ ప్రారంభం కోసం వస్తున్న మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్‌ని బీజేపీ, బీజేవైఎం నాయకులు శ్రీశైలం జాతీయ రహదారిపై అడ్డుకున్నారు.