ఆరోగ్యశ్రీ నెటవర్క్ లోని ప్రైవేటు మరియు కార్పొరేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ పథకం క్రింద ప్రజలకు అందించే వైద్యసేవల నిమిత్తం బకాయి పడ్డ 1200 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో డిసెంబర్ 1 నుండి ఆరోగ్యశ్రీ సేవలను ఆయా ఆసుపత్రులు నిలుపుదల చేసిన విషయం తెలిసినదే. పది రోజులకు ముందే అవుట్ పేషెంట్ సేవలను నిలుపుదల చేసి, ఆరోగ్యశ్రీ ప్రతినిధులకు హెచ్చరిక వంటిది జారీ చేసినా, అప్పటికప్పుడు 150 కోట్ల రూపాయిలు విడుదల చేసినా కూడా, పూర్తి బకాయిలు చెల్లిస్తే గానీ వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పడంతో పాటు మొన్న శనివారం నుండి ఆరోగ్యశ్రీ సేవలను నిలుపుదల విషయంలో ఆరోగ్యశ్రీ సీఈఓ గా వ్యవహరిస్తున్న మాణిక్ రాజ్, ఐఏఎస్ వైఖరి పైన విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడం ప్రభుత్వ కర్తవ్యం కాబట్టి ప్రజలనుండి విమర్శలకు తావివ్వకుండా ఆరోగ్యశ్రీ సీఈఓ మాణిక్ రాజ్ ప్రైవేటు ఆసుపత్రుల సంఘం ప్రతినిధులతో చర్చలకు సంప్రదించారు.
తక్షణమే 150 కోట్లు విడుదల చేసి, నెలరోజుల గడువులో మరో 150 కోట్లు విడుదల చేస్తామని, ఈ ఆర్ధిక సవంత్సరం ముగిసే నాటికి మిగిలి ఉన్న బకాయిల మొత్తాన్ని చెల్లిస్తామని మాటివ్వడంతో పాటు, తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి చర్లకొల లక్ష్మా రెడ్డి నిధుల విడుదలకు చొరవ చూపించడంతో, వెనక్కు తగ్గిన ప్రైవేటు ఆసుపత్రుల సంఘం ఈరోజు అనగా సోమవారం నుండి ఆరోగ్యశ్రీ వైద్యసేవలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రైవేటు ఆసుపత్రుల సంఘం అధ్యక్షడు డాక్టర్ వి.రాకేశ్ మరియు కార్యదర్శి డాక్టర్ టి.హరిప్రకాశ్ ప్రకటన చేశారు. అంతా బాగానే ఉన్న ప్రజల నుండి వ్యక్తమవుతున్న అభ్యంతరం ఏమిటంటే రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులనే మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రులుగా పునరుద్ధణ చేస్తే, ఇటువంటి తలనొప్పులు, ప్రైవేటు ఆసుపత్రులతో అగచాట్లు ఉండవు కదా అని అనుకుంటున్నా, దేశంలో విద్య మరియు వైద్యం ప్రభుత్వ సంరక్షణలో ఉండాలనే విధానం మన దేశంలో సరిగ్గా అవలంబించకపోవడమే దేశ ధౌర్భాగ్యం అనడంలో ఆశ్చర్యమేమీ లేదు.