ఎగ్జిట్ పోల్స్ ఎలా నిర్వహిస్తారు… ఎంతవరకూ నమ్మవచ్చు ?

దేశంలో తొలి దశ ఎన్నికలు దాదాపు ముగిశాయి. సాధారణంగా ఎన్నికలు పూర్తయిన వెంటనే అందరి దృష్టీ ఎగ్జిట్ పోల్స్‌వైపు మళ్లుతుంది. అయితే ఈ సారి దేశమంతా ఎన్నికలు పూర్తయ్యేదాకా ఎగ్జిట్ పోల్స్‌ వెల్లడించకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అసలు ఎగ్జిట్ ఎలా నిర్వహిస్తారు? వీటిలో కచ్చితత్వం ఎంత? అనే అంశాల మీద పరిశీలన జరిపింది ఒక అంతర్జాతీయ ఛానల్ దాని వివరాల ప్రకారం. ఎన్నికల సర్వేలకు అభివృద్ధి చెందిన దేశాల్లో నిర్వాహకులు మొబైల్ ఫోన్, ఇతర సాధనాలపైనే ఎక్కువగా ఆధారపడతారు. కానీ భారత్‌ లో మాత్రం ఓటర్లను చాలా వరకు నేరుగా, క్షేత్రస్థాయిలో కలుస్తారు. ఒకప్పుడు డమ్మీ బ్యాలట్ పేపర్ విధానాన్ని ఈ పోల్స్ నిర్వహించే వారు అనుసరించేవారు. మీరు ఎవరికి ఓటేశారో డమ్మీ బ్యాలట్ పేపర్‌పై టిక్ చేసి, దాన్ని బాక్సులో వేయండని ఓటర్లను కోరేవారు. ఇప్పుడు దాదాపు ఎవ్వరూ ఈ విధానాన్ని అనుసరించడం లేదు. ఇప్పుడు పోలింగ్ బూత్‌లో ఓటు వేసి వచ్చాక ఓటర్లకు నిర్వాహకులు నిర్దిష్టమైన ప్రశ్నలు వేస్తారు. ఇది ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల్లోనే జరుగుతుంది. ఓటర్లు ఇచ్చే సమాధానాన్ని బట్టి ఎక్కువ మంది ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేశారో లెక్కగడతారు. వివిధ పోలింగ్ కేంద్రాల నుంచి ఇదే విధంగా సమాచారం సేకరిస్తారు. ఈ సమాచారం ఆధారంగా పార్టీల ఓటింగ్ శాతం, గెలిచే సీట్ల సంఖ్యను అంచనా వేస్తారు. ప్రస్తుతం అన్ని సంస్థలూ ‘రాండమ్ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్’ విధానాన్నే అనుసరిస్తున్నాయి. ఈ విధానం ప్రకారం- నిర్దిష్ట నియోజకవర్గం లేదా ప్రాంతంలోని జనాభాను వివిధ అంశాల ప్రాతిపదికగా చిన్న చిన్న గ్రూపులుగా వర్గీకరించుకుని, అందరి ఆలోచనలను ప్రతిబింబించేలా సర్వే నిర్వహిస్తారు. ప్రిపోల్, ఎగ్జిట్ పోల్ మధ్య చాలా వ్యత్యాసం ఉంది.
ప్రీ పోల్ సర్వే
ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి ప్రిపోల్ సర్వేలు ఏ దశలోనైనా జరగొచ్చు. చట్టసభ గడువు ముగియక ముందు కానీ లేదా ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు, పొత్తులు తేలక ముందు, ఎవరు ఎవరితో జట్టు కడుతున్నారో లేదా సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుందో స్పష్టం కాకముందు, పార్టీలు/కూటములు అభ్యర్థులను ప్రకటించక ముందు, పోలింగ్ తేదీకి చాలా ముందు, లేదా పోలింగ్ తేదీ సమీపించినప్పుడు కూడా.
కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం పోలింగ్ రోజే చేపడతారు. ఎగ్జిట్ పోల్‌లో ఓటింగ్‌లో పాల్గొన్నవారినే నిర్వాహకులు ప్రశ్నిస్తారు. ఏ సమయంలో ప్రశ్నించారు, ఎలా ప్రశ్నించారు, ప్రశ్నించేటప్పుడు ఓటరు ఒంటరిగా ఉన్నారా, సమూహంలో ఉన్నారా లాంటి అంశాలు ఎగ్జిట్ పోల్‌లో చాలా కీలకం. ప్రిపోల్ సర్వేలో ఎవరిని ప్రశ్నించాలనేది నిర్వాహకులు చాలా వరకు ముందే నిర్ణయించుకుంటారు. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువత, వికలాంగులు, వృద్ధులు, మహిళలు, కులం, మతం, పేదలు, మధ్యతరగతి ఇలా వివిధ వర్గాల వారీగా ఓటర్లను ఎంచుకొంటారు. సాధారణంగా జనాభాలో ఆయా వర్గాల నిష్పత్తికి అనుగుణంగా వారిని ఎంచుకొంటారు.
ప్రిపోల్ సర్వేలతో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్‌లో కచ్చితత్వానికి అవకాశం ఎక్కువ. అయితే “ఎగ్జిట్ పోల్ అంచనాలు తుది ఫలితాలకు కనీసం 95 శాతం దగ్గరగా ఉంటే అంచనాల్లో కచ్చితత్వం ఉన్నట్లు భావించవచ్చు. ఎగ్జిట్ పోల్స్‌లో ‘మార్జిన్ ఆఫ్ ఎర్రర్‌ సాధారణంగా ఐదు శాతం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కేవలం మూడు శాతమే ఉంటుంది. మన దేశంలో 2014-18 మధ్య వెలువడిన వివిధ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పరిశీలిస్తే చాలాసార్లు ఇవి ఎన్నికల్లో విజేతను సరిగ్గానే అంచనా వేశాయి. పార్టీలు సాధించే సీట్ల సంఖ్యను అంచనా వేయడంలో మాత్రం తడబడ్డాయి.