అందాల కిరీటం గెలుచుకున్న తెలుగమ్మాయి

అందాల కిరీటం గెలుచుకున్న తెలుగమ్మాయి

‘పుట్టుకతో వచ్చినది కాదు మనల్ని మనం సరికొత్తగా ఆవిష్కరించుకోవడంలో అందం ప్రతిఫలిస్తుంది’ అని నిరూపిస్తోంది మానస వారణాసి. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన మానస విఎల్‌సిసి ఫెమినా మిస్‌ ఇండియా 2020 పోటీలో గెలిచి తన సత్తా చాటింది. ఇప్పుడీ తెలుగు అమ్మాయి పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ముంబయ్‌ హయ్యత్‌ రిజెన్సీలో బుధవారం జరిగిన విఎల్‌సిసి ఫెమినా మిస్‌ ఇండియా 2020 వేడుకలో తెలంగాణ అమ్మాయి మానస వారణాసి మొదటి స్థానం లో నిలిచి అందాల కిరీటం గెలుచుకోగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాన్యా సింగ్‌ రన్నరప్‌గా, హర్యానాకు చెందిన మనికా షియోకండ్‌ ఫెమినా మిస్‌ గ్రాండ్‌ ఇండియా కిరీటం దక్కించుకున్నారు. 23 ఏళ్ల మానస హైదరాబాద్‌లోని గ్లోబల్‌ ఇండియన్‌ లో స్కూల్‌ చదువు, వాసవి ఇంజినీరింగ్‌ కాలేజీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ పూర్తి చేసింది. ఇంజనీరింగ్‌ చేసిన మానస ఫైనాన్షియల్‌ ఇన్ఫర్మేషన్‌ ఎక్స్‌ఛేంజ్‌ అనలిస్ట్‌గా పనిచేస్తోంది.

సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుకుగా ఉండే మానస తన ప్రాక్టీస్‌ను నిత్యం కొనసాగిస్తూ, ఆ అనుభవాలను పంచుకుంటూనే ఉంటుంది. ‘సాధన చేస్తూ ఉంటే జీవితం ఏం ఇస్తుందో ఎవరూ చెప్పరు. రాయడం, చిత్రలేఖనం, పరిగెత్తడం, పాడటం వంటివి మాత్రమే కాదు స్నేహితులను ఎలా సంపాదించుకోవాలో కూడా సాధన చేయాలి. మంచి ఫ్రెండ్‌గా, మంచి తోబుట్టువుగా, మంచి వ్యక్తిగా ఎలా ఉండాలో కూడా సాధన చేయాలి. ప్రజలు దానిని గుర్తించేంత వరకు సాధన ఆపకూడదు. అవసరమైన చోట కోపం చూపడం, అవసరమైన వారికి దయను ఎలా అందించాలో కూడా నేర్చుకోవాలి. ఇవన్నీ మనల్ని శక్తింతులను చేసేవే, ఇవే మరిన్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతాయని నేను గ్రహించాను’ అని చెప్పారామె.