అమెరికాలో ఉంటోన్న ఓ తెలుగు వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. కుటుంబ కలహాలతో భార్యను హతమార్చి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన టెక్సాస్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, తెలుగు సంఘాల వారు వెల్లడించిన వివరాల ప్రకారం నెకరకంటి శ్రీనివాస్ కు భార్య శాంతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. టెక్సాస్‌లోని ఓ ఇంధన కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్, భార్యతో తరుచూ గొడవపడేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఆ ఇంటి నుంచి తుపాకీ శబ్దాలు వినిపించడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
అయితే, అప్పటికే శాంతి, శ్రీనివాస్‌లు విగత జీవులుగా కనిపించారు. ఆ సమయంలో వీరి కుమార్తె ఇంట్లోనే ఉండగా, కుమారుడు కాలేజీకి వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. శ్రీనివాస్, శాంతి మధ్య గొడవ ఎందుకు జరిగిందన్న విషయమై వారి కుమార్తె వద్దఎలాంటి సమాచారం ఇవ్వలేదని, కేసును విచారిస్తున్నామని పేర్కొన్నారు. మొదట శాంతిని కాల్చి చంపిన శ్రీనివాస్… తర్వాత తనను తాను కాల్చుకొని చనిపోయాడు. ఎంక్వైరీ పూర్తయ్యాక మృతదేహాలను స్వదేశానికి పంపిస్తామని పోలీసులు చెబుతున్నారు.