వారం రోజులు క్రితం బలవన్మరణానికి పాల్పడిన వర్ధమాన సంగీత దర్శకుడు మినపల్లి వినీత్ అలియాస్ అనురాగ్ (28) ఆత్మహత్య మీద అనేక కధనాలు వెలువడుతున్నాయి. వారం క్రితమే ఆత్మహత్యకు పాల్పడ్డ అనురాగ్ ఆత్మహత్యకేసు మిస్టరీగా మారింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రేమ విఫలమో లేక డ్రగ్స్‌కు బానిసవడమే కారణమనే అనుమానాలని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. కొంత కాలంగా వినీత్ కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద అంబర్పేట్ మునిసిపాలిటీ పరిధిలోని మర్రిపల్లి గ్రామంలో ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంట్లో ఉంటున్నాడు.
2008 నుంచి 2011 వరకు మ్యూజిక్ ఆడియో ఇంజనీరింగ్ కోర్సు చేసిన అనురాగ్ 2012 నుంచి ప్రైవేట్ ఆల్బమ్స్ చేయడం ప్రారంభించాడు. మెల్లమెల్లగా సినిమా రంగం వైపు వెళుతున్నాడు. ఈ మధ్యనే సురేష్ ప్రొడక్షన్లో మ్యూజిక్ ఆల్బమ్ చేయడానికి అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నాడు. అయితే ఇటీవలి కాలంలో అనురాగ్ ప్రేమించిన అమ్మాయి దూరంగా ఉంటుండడంతో అతడు మనశ్శాంతికి దూరమవగా కొందరు స్నేహితులు కావాలనే అతడిని డ్రగ్స్‌కు అలవాటు పడేలా చేసినట్టు తెలుస్తోంది. 8వ తేదీన తండ్రి మందలించగా, రాత్రి భోజనం చేయకుండా ఇంట్లో గదిలోకెళ్లి గడియ పెట్టుకున్నాడని సమాచారం.
రాత్రి పది గంటల సమయంలో అనురాగ్ గదిలోకి తొంగి చూడగా అనురాగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉన్నాడని గుర్తించాడు అనురాగ్ తండ్రి. వెంటనే నాగోల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అనురాగ్ మృతి చెందినట్టు నిర్ధారించారు. ప్రేమ, కుటుంబ విషయంలో తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే మరో వైపు అనురాగ్ స్నేహితుడు శ్రీను మాట్లాడుతూ, అతనితో తనకు గత మూడేళ్లుగా పరిచయం ఉందని తల్లిదండ్రులను బెదిరించడానికి గతంలో కూడా రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేశాడని చెప్పాడు. ఆత్మహత్యకు ముందురోజు తన స్నేహితుడితో కలిసి అనురాగ్ బయటకు వెళ్లాడని అన్నారు. కేరళ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ తో కలిసి అనురాగ్ పార్టీ చేసుకున్నాడని శనివారం రాత్రి పది గంటలకు తాగి ఇంటికి వచ్చాడని, ‘ఎందుకు తాగుతున్నావు?’ అని తల్లిదండ్రులు ప్రశ్నించడంతో అనురాగ్ తన బెడ్ రూమ్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని శ్రీనివాస్ చెప్పాడు.
ప్రేమలో వైఫల్యం విషయంలో స్నేహితులు కూడా అతడిని అవమానించినట్టు తెలిసింది. వినీత్ సాధారణంగానే క్షణికావేశానికి లోనయ్యేవాడని… ఈ క్రమంలోనే ఆవేశానికి లోనై ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని తెలుస్తోంది. అనురాగ్ తాను ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గృహప్రవేశం అయిన నెలరోజులకే బెడ్ రూమ్ లో ఉరివేసుకుని మరణించాడు అనురాగ్.