ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన ఓ తెలుగు యువకుడు ప్రమాదవశాత్తు మృతిచెందాడు. బాత్రూంలో కిందపడి తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. వికారాబాద్ జిల్లా ధారూరు మండలం హరిదాస్‌పల్లికి చెందిన సాయిరెడ్డి, నాగేంద్రమ్మ దంపతుల కుమారుడు హరి శివశంకర్‌రెడ్డి (25) హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేశాడు. ఉన్నత విద్య కోసం 2018లో ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడి సౌత్రన్ క్రాస్ యూనివర్సిటీలో ప్రస్తుతం పీజీ రెండో ఏడాది చదువుతున్నాడు.
ఈ నెల 15న తన గదిలో బాత్రూంకు వెళ్లిన శివశంకర్‌రెడ్డి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్నేహితులు అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. మెదడులోని నరాలు చిట్లిపోవడంతో 5 రోజుల క్రితం బ్రెయిన్‌డెడ్ అయ్యాడు. పరిస్థితి విషమించడంతో సోమవారం మరణించా డు. ఈ విషయాన్ని స్నేహితులు అతడి తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు.
మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలంటూ ఆస్ట్రేలియా నుంచి ప్రవాస భారతీయులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా, సాయిరెడ్డి, నాగేంద్రమ్మ దంపతులకు నలుగురు సంతానం. గతంలో ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు అనారోగ్యంతో మృత్యువాత పడ్డారు. మిగిలిన ఒక్క కొడుకు శివశంకర్‌రెడ్డి కూడా చనిపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు.