పదేళ్ల బాలుడు ఆత్మహత్య

పదేళ్ల బాలుడు ఆత్మహత్య

తల్లి సైకిల్‌ కొనివ్వలేదన్న మనస్తాపంతో పదేళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా జ్యోతినగర్‌లో విషాదం నింపింది. ఎన్టీపీసీ సమీపంలోని ప్రగతినగర్‌లో ఓ బాలుడు తల్లితో కలిసి ఉంటున్నాడు. గతంలోనే అతడి తండ్రి, సోదరుడు చనిపోయారు. తనకు సైకిల్ కొనివ్వాలంటూ బాలుడు మూడు రోజులుగా మారాం చేస్తున్నాడు. సోమవారం ఉదయం తల్లి కూలిపనికి వెళ్లగా ఐస్‌క్రీం తేవాలని మధ్యాహ్నం ఫోన్‌ చేసి చెప్పాడు. సాయంత్రం ఆమె ఇంటికి వచ్చేసరికి ఉరేసుకొని కనిపించాడు.

దీంతో షాకైన తల్లి స్థానికుల సాయంతో కొడుకుని గోదావరిఖని ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. తనకు సైకిల్‌ కొనివ్వాలని కొద్దిరోజులుగా మారాం చేస్తున్నాడని, తర్వాత కొనిస్తానని చెప్పినా వినకుండా ఆత్మహత్య చేసుకుని తనను ఒంటరిని చేశాడని తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. తన భర్త, ఇద్దరు కుమారులు ఒక్కరొక్కరుగా మృతి చెందడాన్ని తలుచుకుంటూ ఆవేదన చెందుతోంది. సోమవారం రాత్రి తల్లి ఫిర్యాదు మేరకు ఎన్టీపీసీ ఎస్సై స్వరూప్‌రాజ్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.