ఉపాధ్యాయుడు మందలించాడన్న కారణంతో ఓ పదో తరగతి విద్యార్థి మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని చెల్లాపూర్‌లో శనివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పోలెపల్లి పెంటయ్య కుమారుడు హరికృష్ణ(15) సాల్వీడ్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 1 నుంచి పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో 2న హరికృష్ణ పాఠశాలకు వెళ్లాడు. క్లాస్ టీచర్ రమేశ్ విద్యార్థులంతా అంగీకారపత్రాలు తీసుకురావాలని సూచించారు.
గతంలో హరికృష్ణ పాఠశాలకు సక్రమంగా వెళ్లేవాడు కాదని, ప్రస్తుతం పదో తరగతి కావడంతో క్రమం తప్పకుండా స్కూలుకు రావాలని ఉపాధ్యాయులు మందలించినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో హరికృష్ణ దూలానికి ఉరి వేసుకుని మృతి చెందాడు. కొద్దిసేపటికి కుటుంబీకులు వచ్చిచూడగా ఓ సూసైడ్ నోట్ లభ్యమైంది. ‘నా చావుకు కారణం రమేశ్ సార్.. రమేశ్ సార్ నన్ను పాఠశాలకు రావొద్దని బెదిరించాడు. ఇంటి వద్దే ఉండి టీవీలో పాఠాలు విని పరీక్షలు రాయాలి.. స్కూల్‌కు వస్తే కొడతాను. ఇంటి వద్ద ఉంటే స్కూల్‌కు ఎందుకు వెళ్లలేదు అని అడుగుతున్నారు.. నా చావుకు రమేశ్ సార్ కారణం’అని సూసైడ్ నోట్లో విద్యార్థి హరికృష్ణ రాశాడు. తండ్రి పెంటయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు.