జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు శనివారం రెచ్చిపోయారు. మూడు వేర్వేరు చోట్ల గ్రనేడ్ దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మరొకరు గాయపడ్డారు. తొలుత శ్రీనగర్‌లోని కారా నగర్ వద్ద శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మాజీద్ అహ్మద్ గోజ్రీ అనే వ్యక్తిపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మాజీద్ అహ్మద్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
ఈ దాడి తర్వాత ఘటనా స్థలికి చేరుకున్న భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దీంతో నగరవ్యాప్తంగా అదనపు బలగాలను అన్ని ప్రాంతాల్లో మోహరించి, ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించారు. కారా నగర్ దాడి జరిగిన గంటలో పక్కనే ఉన్న బటామాలూలో మరో వ్యక్తిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సుమారు రాత్రి 8 గంటల ప్రాంతంలో మహ్మద్ షఫీ దార్ అనే వ్యక్తిపై కాల్పులు జరపడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దార్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు.
ఈ రెండు ఘటనలతో అప్రమత్తమైన జమ్మూ కశ్మీర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముష్కరుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ రెండు దాడులకు మధ్య సాయంత్రం 6.50 గంటలకు దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లోని సీఆర్పీఎఫ్ బంకర్‌పై ఉగ్రవాదులు గ్రనేడ్లు విసిరారు. కేపీ రోడ్డులోని 40వ బెటాలియన్ బంకర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులు విసిరిన గ్రనేడ్ గురి తప్పి బంకర్ పక్కన పేలిందని, ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయం కాలేదని తెలిపారు.