ఉమ్మడి పాలమూరు జిల్లా వేరుశనగ రైతులు పోరుబాట పట్టారు. వ్యవసాయ మార్కెట్లలో వ్యాపారులు సరైన ధర నిర్ణయించడం లేదంటూ ఆందోళనకు దిగారు. నాగర్‌ర్నూల్ జిల్లా అచ్చంపేటలో గిట్టుబాటు ధర కోసం రైతులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మార్కెట్‌కు వచ్చిన వేరుశనగకు క్వింటాకు కనీసం రూ.7000 ధర నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఛైర్మన్ ఛాంబర్‌కు వెళ్లారు. ధరలు పెంచుతామని హామీ ఇచ్చినా మద్దతు ధర రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యాపారులతో మాట్లాడతానని ఛైర్‌పర్సన్ అరుణ రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారు వినలేదు. కోపోద్రిక్తులైన రైతులు కార్యాలయంలో ఫర్నీచర్ ధ్వంసం చేసి ఛైర్‌పర్సన్‌ను బలవంతంగా వేరుశనగ కుప్పల వద్దకు లాక్కెళ్లారు. పలువురు మహిళా రైతులు ఆమెపై దాడి చేశారు. అనంతరం వ్యాపారులు రావాలంటూ ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. రైతులను ఆందోళన విరమింపజేసేందుకు పోలీసులు రావటంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న వేరుశనగకు రీటెండర్ నిర్వహిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.