హైదరాబాద్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి వలసలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక త్వరలో మరో నలుగురైదుగురు BRS ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. గులాబీ పార్టీ నుంచి చేరిన వారిలో ఆర్థికంగా బలంగా ఉన్న వారిని లోక్‌సభ బరిలో నిలపాలని కాంగ్రెస్ యోచిస్తోంది. గ్రేటర్ పరిధిలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం మూడు సీట్లనే కాంగ్రెస్ గెలవగా లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం సిటీలోని నాలుగు స్థానాలను గెలవాలని సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలోనే నగరం పరిధిలో పట్టున్న ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలను చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం కాంగ్రెస్‌లో చేరగా.. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న మరో ఇద్దరు మాజీ మంత్రులు, మరో ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు, తొలిసారి గెలిచిన మరో ఎమ్మెల్యే కూడా పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారని సమాచారం.