తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రస్తుతం ఝార్ఖండ్ గవర్నర్‌గా రాధాకృష్ణన్ బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేయడంతో ఆమె స్థానంలో రాధాకృష్ణన్ను రాష్ట్రపతి నియమించారు. ఈ క్రమంలో రాధాకృష్ణన్ అదనంగా తెలంగాణ బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
1957 మే 4న జన్మించిన సీపీ రాధాకృష్ణన్.. తమిళనాడులోని కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి రెండు సార్లు బీజేపీ తరుఫున ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పని చేసిన ఆయన 2016 నుంచి 2019 వరకు ఆల్ ఇండియా కాయర్ బోర్డ్ ఛైర్మన్‌గా సేవలందించారు. తమిళనాడు బీజేపీ సీనియర్ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయన జార్ఖండ్ గవర్నర్గా నియమితులయ్యారు. ఇక ఇప్పుడు తెలంగాణ ఇంఛార్జ్ గవర్నర్గా, పుదుచ్చేరి ఎల్జీగా అదనపు బాధ్యలు చేపట్టారు.