TG Politics: కాళేశ్వరంపై న్యాయవిచారణకు జూన్‌ 30 వరకు గడువు

TG Politics: Deadline for trial on Kaleswaram till June 30
TG Politics: Deadline for trial on Kaleswaram till June 30

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో జూన్‌ 30వ తేదీలోగా న్యాయవిచారణ పూర్తి చేయాలని కోరింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పీసీ ఘోష్‌ నేతృత్వంలో న్యాయవిచారణకు మంత్రివర్గం ఆమోదం తెలపగా, ఇందుకు సంబంధించిన విచారణాంశాలపై ఉత్తర్వులు జారీ చేశారు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని 3 బ్యారేజీల్లో ఒకటైన మేడిగడ్డ బ్యారేజీలో గత ఏడాది అక్టోబరు 21న కొన్ని పియర్స్‌ కుంగాయి. ప్లానింగ్‌, డిజైన్‌, నాణ్యత, నిర్వహణకు సంబంధించిన అంశాల్లో లోపాల వల్ల ఇలా జరిగిందని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తేల్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలోనూ అక్రమాలు జరిగినట్లు పేర్కొంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో నిర్లక్ష్యం, అక్రమాలు, ప్లానింగ్‌, డిజైన్‌, నిర్మాణంలో లోపాలు, కాంట్రాక్టు ఒప్పందానికి భిన్నంగా జరగడం, నిర్వహణలో లోపం వల్ల స్ట్రక్చర్‌కు భారీగా నష్టం వాటిల్లడం, కాంట్రాక్టర్లకు అయాచిత ప్రయోజనం కలిగించి ఈ పరిస్థితికి కారణమైన వారిని గుర్తించడం వంటి అంశాలను విచారణ కమిషన్‌ పరిధిలో చేర్చుతూ ఆదేశాలు జారీ చేసింది.