హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. మరో రెండు లైన్లలో ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఎంఎంటీఎస్ రెండో దశ పనులు మొత్తం పూర్తై సనత్‌నగర్ – మౌలాలి మధ్య ఎంఎంటీఎస్ రెండో లైను సిద్ధమైంది. ఈ దశలో భాగంగా మొత్తం 95 కిలోమీటర్ల మేర లైన్లు వేయడం, విద్యుదీకరణ, స్టేషన్ల నిర్మాణం పూర్తయ్యాయి. చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి మార్చి మొదటి వారంలో రానున్న ప్రధాని నరేంద్ర మోదీ అదే రోజు సనత్‌నగర్ – మౌలాలి మధ్య మొత్తం 22 కిలోమీటర్ల మేర రెండో దశ ఎంఎంటీఎస్ రైళ్లను కూడా ప్రారంభించనున్నారు.
మరోవైపు సికింద్రాబాద్ – ఘట్‌కేసర్ లైన్ కూడా అదేరోజు ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు సమాచారం. చర్లపల్లి స్టేషన్ ప్రారంభమయ్యాక అక్కడి నుంచి 25 జతల దూరప్రాంతాల రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. అత్యంత రద్దీగా మారిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌తో సంబంధం లేకుండా నేరుగా మౌలాలి నుంచి హైటెక్‌సిటీకి ఎంఎంటీఎస్‌లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో హైటెక్‌సిటీ వైపు ప్రయాణ కష్టాలు మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు తీరుతాయి.