తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎట్టకేలకు గవర్నర్ పదవికి రాజీనామా చేయడంపై స్పందిస్తూ కారణాన్ని చెప్పారు. నిజాయతీగల, ప్రత్యక్ష రాజకీయాల కోసం గవర్నర్ పదవికి రాజీనామా చేశానని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణా, పుదుచ్చేరి గవర్నర్ పదవులకు రాజీనామా లేఖ రాష్ట్రపతికి పంపిన తమిళిసై చెన్నై చేరుకుని విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై దృష్టి సారించేందుకే పదవికి రాజీనామా చేశానని తెలిపారు. తెలంగాణా, పుదుచ్చేరి ప్రజల ఆప్యాయతకు రుణపడి ఉంటానని చెప్పారు. గవర్నర్‌గా అవకాశం ఇచ్చిన ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రికి మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల మధ్య ప్రత్యక్షంగా పని చేయటమే తనకు ఇష్టమన్న తమిళిసై… గవర్నర్ పదవితో చాలా అనుభవం దక్కిందని వెల్లడించారు. నాలుగున్నరేళ్లలో ఇద్దరు ముఖ్యమంత్రులు, రెండు ఎన్నికలు, గవర్నర్ బాధ్యతుల కూడా నిర్వర్తించానని పేర్కొన్నారు. కరోనాను సమర్థంగా ఎదుర్కొని అభినందనలు అందుకున్నానని చెప్పారు. విలాసవంతమైన జీవితాన్ని వదిలి ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్లీ వచ్చానంటే ఎందుకనేది ప్రజలు అర్ధం చేసుకోవాలని వ్యాఖ్యానించారు.