తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇసుక విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇసుక అమ్మకాలకు కొత్త విధానం తీసుకురావాలని నిర్ణయించింది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేలా పాలసీని రూపొందించాలని యోచిస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు.
గనులు, భూగర్భ వనరుల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం రోజున సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పుడున్న ఇసుక విధానం అవినీతిమయంగా మారిందని సీఎం అన్నారు. దాదాపు 25 శాతం ఇసుక అక్రమంగా తరలి వెళ్తోందని.. అక్రమ రవాణాను వెంటనే అరికట్టాలని అధికారులను ఆదేశించారు. అన్ని స్థాయిల్లో అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలంటూ, ఇందుకు 48 గంటల డెడ్లైన్ విధించారు.
ఇసుక అక్రమాలపై రెండ్రోజుల తర్వాత విజిలెన్స్, ఏసీబీ విభాగాలను రంగంలోకి దింపాలని రేవంత్ ఆదేశించారు. అన్ని జిల్లాల్లో వెంటనే తనిఖీలు చేపట్టి బాధ్యులైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టొద్దని చెప్పారు. అన్ని రూట్లలో టోల్గేట్ల వద్ద నమోదైన సమాచారం ఆధారంగా ఇసుక లారీల అక్రమ రవాణా లెక్కలను బయటకు తీయాలన్నారు.