ఆసియాలో అతిపెద్ద గిరిజన కుంభమేళా.. తెలంగాణలో జరిగే చారిత్రాత్మక క్రతువు మేడారం మహా జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. సమ్మక్క, సారలమ్మలు వనం వీడి జనారణ్యంలోకి వచ్చి గద్దెలపై కొలువుదీరనున్నారు. ఈరోజు నుంచి ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో మహా జాతర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మహాజాతర ప్రారంభం కానుండటంతో మొక్కలు, దర్శనం కోసం వచ్చే వారి సంఖ్యతో మేడారం పరిసరాలు పూర్తిగా జనసంద్రంగా మారనున్నాయి.
భక్తుల కొంగు బంగారం సమ్మక్క-సారలమ్మ జాతర మాఘశుద్ధ పౌర్ణమి రోజున రెండేళ్లకొకసారి జరుగుతుందని చెప్పాల్సిన అవసరమే లేదు. మేడారం మహాజాతర పూజల తొలిఘట్టం గత బుధవారమే అత్యంత వైభవంగా ప్రారంభమైంది. జాతరకు సరిగ్గా వారం ముందు నిర్వహించే మండమెలిగే పండుగను మేడారంలోని సమ్మక్క దేవత, కన్నెపల్లిలోని సారలమ్మ తల్లి పూజారులు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరుగుతుంది. మేడారం మహాజాతర జంపన్న గద్దెకు చేరే క్రతువులో ప్రారంభం అయింది. పూజారి పోలెబోయిన సత్యం, గొంది సాంబశివరావు ఆధ్వర్యంలో కన్నెపల్లి నుంచి జంపన్న వాగు ఆదివాసీ సంప్రదాయాలతో మంగళవారం రాత్రి 7.09 గంటలకు బయలుదేరారు. 8.31 గంటలకు జంపన్నను గద్దెకు చేర్చారు.