ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలని, మిగతా సమయాల్లో అభివృద్ధికే ప్రాధాన్యమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. MGBS నుంచి ఫలక్నుమా వరకు 5.5 కి.మీ మేర మెట్రో ప్రాజెక్టు విస్తరణకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ విషయంలో ఎంఐఎంతో కలిసి పనిచేస్తామని తెలిపారు.
‘హైదరాబాద్ అభివృద్ధికి 2050 వైబ్రంట్ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. పాతబస్తీలో రోడ్ల విస్తరణకు రూ.200 కోట్లు కేటాయించాం. మూసీ నదిని 55 కి.మీ మేర సుందరీకరిస్తాం. మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసి చూపిస్తాం. మెట్రో రైలు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్కే కాదు పాతబస్తీకి ఉండాలి. అందులో సంపన్నులే కాదు మధ్యతరగతి ప్రజలూ ప్రయాణించాలి. చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ మెట్రోలో అతిపెద్ద జంక్షన్ కాబోతోంది. చంచల్గూడ జైలును అక్కడి నుంచి తరలించి.. విద్యాసంస్థ ఏర్పాటు చేస్తాం. రాజకీయాలు వేరు అభివృద్ధి పేరు. 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. వచ్చే నాలుగేళ్లలో పాతబస్తీ మెట్రో రైలు పూర్తి చేసి ప్రయాణిస్తాం.