దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ముగిసినట్టే మే 23న ఎన్నికల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఎన్నికల నియమావళిని ఎత్తివేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇదే సమయంలో జరిగాయి. మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా, మార్చి 18న తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో మూడు నెలలకు పైగా ఎన్నికల కోడ్ అమలు చేశారు. తాజాగా ఈసీ ప్రకటనతో కోడ్ ముగిసింది. నిజానికి వరస ఎన్నికలతో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది. ఎన్నికల కోడ్ ఉండడంతో ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టే పరిస్థితి లేదు. దీంతో ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. శంకుస్థాపనలకే అభివృద్ధి పనులు పరిమితమయ్యాయి. తెలంగాణలో 2018 సెప్టెంబర్‌లో అసెంబ్లీని రద్దు చేసిన నాటి నుంచి ఎన్నికల కోడ్ అమలవుతూనే ఉంది. ఎన్నికల ప్రవర్తన నియామవళి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాలు చేపట్టకూడదు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే గ్రామపంచాయతీ ఎన్ని కలు, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో ఇప్పటి వరకూ కోడ్ అడ్డు వస్తోనే ఉంది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ కు తెరపడటంతో కొత్త అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునేందుకు అడ్డంకి తొలగింది. ఇక నుండి ఎటువంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి పరుగులు పెట్టాలని కోరుకుంధాం.