జగన్ మొదటి సంతకం దాని మీదే…పార్టీలతో సంబంధం లేదట ?

the first sign of the jagan on that file

ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ ఆ తర్వాత ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడారు. తనను గెలిపించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు. పాదయాత్రలో పేదలు, మధ్య తరగతి ప్రజలు పడిన కష్టాలు చూశానని పాదయాత్రలో తనకు తోడ్పాటు అందించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. నవరత్నాల్లో భాగంగా ప్రతీ అవ్వ, తాతలకు, వితంతువులైన అక్కచెల్లెమ్మలకు పెన్షన్ 3000కు పెంచుతామని తాను హమీ ఇచ్చానని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. అందులో భాగంగా ‘వైఎస్సాఆర్ పెన్షన్’ కానుక కింద అవ్వాతాతలకు వచ్చే నెల నుంచి రూ.2,250 పెన్షన్ అందిస్తామని వెల్లడించారు. దీన్ని వచ్చే ఏడాది 2500 చేస్తామనీ, మరుసటి ఏడాది 2,750కి పెంచుతామని పేర్కొన్నారు. ఈ ఫైలుపైనే తాను తొలిసంతకం పెడుతున్నానని ప్రకటించారు. అనంతరం ఫైలుపై జగన్ సంతకం పెట్టారు. నవరత్నాల పథకాల ద్వారా కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా ప్రజలకు లబ్ధి కలిగించాలని జగన్ అన్నారు. అర్హులైన ప్రతీఒక్కరికి నవరత్నాల ద్వారా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అందరి ఆకాంక్షలు, ఆశలను పరిగణనలోనికి తీసుకుంటానన్నారు. గత ప్రభుత్వాలు, పాలకుల మాదిరిగా పేజీలకు పేజీలు, పుస్తకాలకు పుస్తకాలతో మేనిఫెస్టో తీసుకురాలేదని, కేవలం రెండు పేజీలతో మేనిఫెస్టో తీసుకువచ్చామని జగన్ చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోను ఎన్నికలైన తరువాత చెత్తబుట్టలో పడేయనని అదే తనకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని ఆయన అన్నారు.