జీ20 దేశాలు, ఇతర దేశాల పార్లమెంటు స్పీకర్ లు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో భారత్ లో పీ20 సదస్సు నిర్వహిస్తున్నారు. ఇవాళ, రేపు ఢిల్లీలో జరిగే ఈ పీ20 సదస్సుకు ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిలుస్తోంది. నేడు ఏర్పాటు చేసిన పలు సెషన్లకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పీ20 సదస్సు వేదిక వద్ద ఆసక్తికర సన్నివేశం ఆవిష్కృతమైంది. ప్రధాని నరేంద్ర మోదీకి మెక్సికో సెనేట్ అధ్యక్షురాలు అనా లిలియా రివేరా రాఖీ కట్టారు. మోదీని ఓ సోదరుడిగా భావిస్తున్నట్టు తెలిపారు. ఓ విదేశీ రాజకీయవేత్త తనకు రాఖీ కట్టడం పట్ల మోదీ హర్షం వెలిబుచ్చారు. అనా లిలియా తలపై చేయి వేసి దీవించారు. భారత్-మెక్సికో సంబంధాలు మరింత సుహృద్భావ ధోరణిలో ముందుకెళ్లాలని అభిలషిస్తున్నట్టు తెలిపారు.
సమ్మిట్ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరుకు కృషి చేయాలని ఉద్ఘాటించారు. దశాబ్దాలుగా భారతదేశం సీమాంతర ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కొంటోందో ఎత్తిచూపిన ప్రధాన మంత్రి, “భారతదేశం చాలా సంవత్సరాలుగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంది. సుమారు 20 సంవత్సరాల క్రితం, సమావేశాలు జరుగుతున్న సమయంలో ఉగ్రవాదులు మన పార్లమెంటును లక్ష్యంగా చేసుకున్నారు. ఉగ్రవాదంపై ఈ పోరాటంలో ఎలా కలిసి పని చేయాలో ప్రపంచంలోని పార్లమెంటులు మరియు వారి ప్రతినిధులు ఆలోచించాలి. “వివాదాలు మరియు ఘర్షణలతో నిండిన ప్రపంచం ఎవరికీ ప్రయోజనం కలిగించదు. విభజించబడిన ప్రపంచం మన ముందున్న సవాళ్లకు పరిష్కారాలను ఇవ్వదు. ఇది శాంతి మరియు సోదరభావానికి సమయం, కలిసి ముందుకు సాగాల్సిన సమయం,కలిసి కదలాల్సిన సమయం. ఇది సమయం. అందరి అభివృద్ధి మరియు సంక్షేమం కోసం, ”అని ఆయన అన్నారు.