Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయంగా ఎన్ని ప్రతికూలతలు ఎదురవుతున్నప్పటికీ..మోడీ ఇప్పటికీ దేశంలో అత్యంతశక్తిమంతమైన వ్యక్తిగా నిలిచారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ 2017-18 సంవత్సరానికి గానూ ప్రకటించిన అత్యంత శక్తిమంతమైన 100 మంది భారతీయుల జాబితాలో మోడీ మొదటిస్థానంలో నిలిచారు. మోడీ ఈ జాబితాలో ఇలా అగ్రస్థానంలో నిలవడం ఇది వరుసగా మూడోసారి. 2015-16, 2016-17 జాబితాల్లోనూ మోడీ తొలిస్థానంలోనే ఉన్నారు. ఇక మోడీ తర్వాత ప్రస్తుతం దేశంలో అత్యంత శక్తిమంతమైన రెండో వ్యక్తి ఎవరో తెలుసా…మరెవరో కాదు..మోడీ సన్నిహిత మిత్రుడు, బీజేపీ జాతీయఅధ్యక్షుడు అమిత్ షా. ie 100 పేరుతో విడుదల చేసిన ఈ బాబితాలో అమిత్ షా రెండో స్థానంలో నిలిచారు. ఆయన ఇలా మోడీ తర్వాత అత్యంతశక్తిమంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందడం ఇది వరుసగా రెండోసారి. ఈ జాబితాలో తొలి పదిస్థానాల్లో ఇద్దరు మినహా మిగిలిన వారంతా రాజకీయనాయకులే.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా మూడోస్థానంలో, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ నాలుగో స్థానంలో, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఐదో స్థానంలో, పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరో స్థానంలో, భారత హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఏడోస్థానంలో, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎనిమిదో స్థానంలో, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తొమ్మిదో స్థానంలో, ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ పదో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తొలి పదిమందిలో చోటు దక్కలేదు. ఆయన పదకొండోస్థానంలో ఉన్నారు. ఇక మిగిలిన రంగాలకు చెందిన ప్రముఖుల విషయానికొస్తే…భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ 20వ స్థానంలో, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ 91వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో సినీ ప్రముఖులకు చివరిస్థానాలు దక్కాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, కరణ్ జోహార్, కంగనా రనౌత్, దీపికా పదుకునే, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 75 నుంచి 100 స్థానాల మధ్యలో ఉన్నారు.