డబ్బు, బంగారం కోసం వృద్ధురాలిని దుండగులు వారం రోజుల క్రితం హత్య చేసి డ్రెయిన్ పక్కన తాటిబొందల్లో పడవేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూడటంతో దివిసీమలో తీవ్ర కలకలం రేపింది. సేకరించిన వివరాల ప్రకారం.. మండలంలోని లింగారెడ్డిపాలెం శివారు నక్కవానిదారి గ్రామానికి చెందిన మట్టా వీరమ్మ (65) భర్త, ఇరువురు కుమారులు గతంలోనే మృతిచెందడంతో వ్యవసాయ పనులకు వెళ్తూ మరో కుమారుడు బసవమాణిక్యాలరావు వద్ద ఉంటోంది.
కూలి పనులకు వెళ్లిగా వచ్చిన డబ్బులను కుదవపెట్టి వీరమ్మ ఇరుగుపొరుగు వారికి వడ్డీకి ఇస్తోంది. వీరమ్మకు గ్రామ సమీపంలోని పొలాల్లో అడపాదడపా జరిగే పేకాట శిబిరాల వద్దకు వెళ్లే అలవాటు ఉంది. అక్కడ పేకాటరాయుళ్లకు కూడా వీరమ్మ నగదును పెట్టుబడి పెడుతుందని గ్రామస్తులు చెప్పారు. ఈ నేపథ్యంలో వీరమ్మ వారం రోజుల నుంచి కనిపించకుండా పోగా.. గురువారం రాత్రి గ్రామ సమీపంలోని రత్నకోడు డ్రెయిన్ పక్క తాటిబొందల్లో శవమై కనిపించింది.
గురువారం మధ్యాహ్నం డ్రెయిన్ గట్టు వెంట ఉన్న తాటిబొందల ఆకులను నరికేందుకు గ్రామస్తులు వెళ్లగా అక్కడ తీవ్రమైన దుర్వాసన రావడంతో వెళ్లి పరిశీలించడంతో మహిళ మృతదేహం కనిపించింది. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామ వీఆర్వో మేడికొండ బాబురావు ఫిర్యాదు మేరకు తొలుత గుర్తుతెలియని మహిళ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.