వరంగల్ సబ్‌డివిజన్ పరిధిలోని మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో కస్టడీలో ఉన్న దొంగ పోలీసుల కళ్లు కప్పి పరారైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఇటీవల ఓ దొంగతనం కేసులో నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం రాత్రి మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో కస్టడీకి అప్పగించారు. అర్ధరాత్రి తర్వాత పోలీసులు నిద్రిస్తున్న సమయంలో దొంగ వారి కళ్లుగప్పి చాకచాక్యం పరారయ్యాడు. పారిపోతూ విధుల్లో ఉన్న కానిస్టేబుళ్ల పర్సులు, సెల్‌ఫోన్లు సైతం ఎత్తుకెళ్లడం గమనార్హం. కాగా, దొంగ కోసం మట్టెవాడ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నట్లు తెలిసింది.
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఫతేషాపూర్‌లో కాసం నవీన్ ఇంట్లో బంగారు ఉంగరం దొంగలించిన అదే గ్రామానికి చెందిన మైనర్ బాలుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేష్‌నాయక్ ఆదివారం తెలిపారు. శనివారం మధ్యాహ్నం సదరు బాలుడు అదే గ్రామానికి చెందిన నవీన్ ఇంట్లో దూరి బీరువాలో నుంచి ఉంగరం చోరీ చేసి వెళ్తుండగా స్థానికులు గుర్తించాడు. ఆదివారం ఉదయం గ్రామ పెద్దలు బాలుడిని పిలిపించగా నేరం ఒప్పుకొని చోరీ చేసిన ఉంగరం అప్పగించాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాలుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.