కరోనా పేషెంట్స్ ఇంట్లో దొంగలు … బీభత్సం

కరోనా వైరస్ భూతాన్ని అవకాశంగా మలుచుకొని దోపిడీకి పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. కరోనా పేషెంట్ల ఇళ్లలో లూటీ చేస్తున్నారు దోపిడీ దొంగలు. కిటికీలు పగలగొట్టి దొంగల బీభత్సం సృష్టించిన ఘటన జమ్మూకాశ్మీర్ లో చోటుచేసుకుంది. కరోనా మహమ్మారి పేరు వింటేనే బెంబేలెత్తిపోతుంటే.. ఏకంగా కోవిడ్-19 సోకిన వాళ్ల ఇళ్లలోనే దోపిడీకి పాల్పడిన షాకింగ్ ఘటన ఉత్తర కాశ్మీర్ లోని బందిపోరా జిల్లా హజిన్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

అక్కడ ఇళ్లలో ఎవరూ లేరని తెలిసిన దొంగలు.. దొంగతనం చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ సోకిందని తెలిస్తేనే ఆమడదూరం పారిపోతుంటే ఆ దొంగలకు మాత్రం ఏమాత్రం భయం అనిపించలేదు. ఏకంగా కరోనా పాజిటివ్ వచ్చి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఇళ్లనే టార్గెట్ చేశారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారించిన వ్యక్తి కుటుంబ సభ్యులను, అతను కలిసిన వ్యక్తులను కూడా క్వారంటైన్‌కి పంపించడం కూడా వారికి బాగా కలిసొచ్చింది. ఇంట్లో ఎవరూ లేరని పక్కాగా తెలియడంతో తాపీగా వచ్చి సైలెంట్‌గా పని పూర్తి చేసుకెళ్లారు. మరుసటి రోజు ఇంటి బయట పడి ఉన్న సూట్‌కేసులను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం తెలిసింది. కరోనాకు కూడా భయపడకుండా ఇంటిని లూటీ చేసిన దొంగల తెలివే తెలివి అంటూ ఆశ్చర్యపోతున్నారు.