థర్డ్‌ వేవ్‌ ముప్పు

థర్డ్‌ వేవ్‌ ముప్పు

కరోనా మహమ్మారి ఇంకా సమసిపోలేదు. ఇప్పటికే రెండు వేవ్‌లు ప్రపంచవ్యాప్తంగా జనాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని రోజులుగా కేసులు సంఖ్య భారీగా తగ్గింది. అయినప్పటికి కోవిడ్‌ ముగిసిపోలేదని.. థర్డ్‌ వేవ్‌ ముప్పు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మన దేశంలో పలు రాష్ట్రాల్లో వెలుగు చూస్తున్న కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఏవై.4.2(AY.4.2) తీవ్ర భయాందోళనలు కలగజేస్తుంది. ఈ వేరియంట్‌కు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఈ కొత్త వేరియంట్‌.. సెకండ్‌ వేవ్‌ సమయంలో తీవ్ర నష్టం కలిగించిన డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కుటుంబానికి చెందినది అని.. దీని వల్ల కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశం అధికంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, కేరళ, తెలంగాణ, జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాల్లో ఈ కొత్త వేరియంట్‌ ప్రవేశించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అధికారులు ఈ కొత్త వేరియంట్‌ గురించి పరిశోధించే పనిలో ఉన్నారు.

ఇక ప్రస్తుతం మహారాష్ట్ర సహా దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య పెరిగింది. దేశంలో 16,156 కొత్త కేసులు నమోదు కాగా.. 733 మంది మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,60,989 యాక్టీవ్‌ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.