ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా జట్టుకు కోల్పోవడం నిరాశగా ఉన్నా.. సిరీస్ ఓటమితో మాకు మంచి గుణపాఠం కలిగిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. బుధవారం మూడో వన్డే మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రెజంటేషన్ సందర్భంగా మ్యాచ్ విజయంపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
‘మా పర్యటన ఇక్కడితో ముగిసిపోలేదు. రానున్న రోజుల్లో మూడు టీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఒక కెప్టెన్‌గా వన్డే సిరీస్ ఓడిపోవడం నిరాశను కలిగించింది. అయినా ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్ ఓటమి మాకు ఒక గుణపాఠం కానుంది. మ్యాచ్ ఆడేటప్పుడు మనసు పెట్టి ఆడితే విజయం సాధిస్తామని మూడో వన్డేలో విజయం ద్వారా మాకు అర్థమైంది. ఎప్పుడైనా ఆటలో దెబ్బలు తగిలితేనే గాయం విలువేంటో తెలుస్తుంది.. ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాం. అలాగే సిరీస్ ఓడిపోయినంత మాత్రానా మేము పూర్తిగా కోల్పోయినట్లు కాదు. ఈ ఓటమే రానున్న మ్యాచ్‌ల్లో మాకు విజయాలను సమకూరుస్తుందని ఆశిస్తున్నా.
ఇక నేడు జరిగిన మ్యాచ్ విషయానికి వస్తే.. ఈరోజు మా ఆటతీరులో మార్పు వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఓపెనర్‌గా అవకాశం ఇచ్చినా శుభమన్ గిల్ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. శిఖర్‌తో కలిసిఇన్నింగ్స్ ఆరంభించిన గిల్ కొన్ని మంచి షాట్లు ఆడినా దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు.
నిజానికి మా బ్యాట్స్‌మన్లు అందరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. అయ్యర్ మొదలుకొని రాహుల్, జడేజా, పాండ్యా వరకు బ్యాటింగ్ లైనఫ్ పటిష్టంగా ఉంది. ఈ మ్యాచ్‌లో నా ప్రదర్శనను పక్కడ పెడితే పాండ్యా, జడేజాలు ఆడిన తీరు మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. నేను ఔటైన తర్వాత వారిద్దరు నిలదొక్కుకొని టీమిండియాకు 300 పరుగులు గౌరవప్రదమైన స్కోరు అందించడం గొప్ప విషయంగా చెప్పవచ్చు.
ఇక బౌలర్ల విషయానికి వస్తే.. బుమ్రా, శార్దూల్ ఠాకూర్, సైనీ, నటరాజన్‌లతో పేస్ విభాగం పటిష్టంగా కనిపించినా.. ఇక్కడి పిచ్‌లు బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉండడంతో మా బౌలర్లు తేలిపోయారు. అంతేకాని మా బౌలర్లు విఫలమయ్యారంటే ఒప్పుకోను.. ఎందుకంటే ఆసీస్ బౌలర్లు కూడా అంత గొప్పగా ఏం రాణించలేదట్టీ ఓటమితో నేర్చుకున్న పాఠాలను రానున్న రోజుల్లో జరగనున్న మ్యాచ్‌ల్లో రాణించి ఫలితాలు సాధించేలా చూసుకుంటాం.’ అని చెప్పుకొచ్చాడు.
కాగా కోహ్లి ఈ మ్యాచ్‌లో ఒక అరుదైన రికార్డు నెలకొల్పాడు. 23 పరుగుల వద్ద ఉన్నప్పుడు వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగులు పూర్తి చేసి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 302 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 92, జడేజా 66, కోహ్లి 63 పరుగులతో రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 49.3 ఓవర్లలో 289 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఫించ్ 75, మ్యాక్స్‌వెల్ 59 పరుగులు చేశాడు. కాగా ఇరు జట్ల మధ్య శుక్రవారం(డిసెంబర్ 4) తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.