ఫిలింనగర్‌లో ప్రేమ్‌సాగర్ (20) అనే యువకుడి మృతి కేసులో నిన్న మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అతడిది హత్య కాదని అపార్ట్‌మెంట్‌లో చోరీకి ప్రయత్నించి, 15 అడుగుల ఎత్తు నుంచి సెల్లార్‌లో పడి మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు. గత సోమవారం ఫిలింనగర్ ఫేజ్ 2లో ఒక యువకుడు తీవ్ర గాయాలతో మృతి చెందాడు.
గంజాయి మత్తులో వివాదం చెలరేగి అతడి స్నేహితులే దారుణంగా హతమార్చారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్‌గా మారాయి. కానీ ఆధారాలు లభించక పోవడంతో పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా ప్రేమ్ సాగర్ స్నేహితుడు, పలు చోరీ కేసులున్న సత్యానంద్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు.
ప్రేమ్‌సాగర్‌ను తను హత్య చేయలేదని మత్తులో ఉన్న సత్యానంద్ చెప్పాడు. దీంతో సీసీ కెమెరాలలో సహాయంతో కేసు మిస్టరీని ఛేదించారు. దొంగతనాలు చేసి జైలుకి వెళ్లొచ్చిన సత్యానంద్, ప్రేమ్‌సాగర్ ఇద్దరు మత్తు కోసం నిద్ర మాత్రలు తీసుకున్నారు. ఆ మత్తులో ఫిలింనగర్ ఫేజ్ 2లో డీవీఎస్ ఎన్‌క్లేవ్‌లో దొంగతనం చేయాలని భావించారు.
ఆ భవనం మూడో అంతస్థు ప్రధాన రహదారికి సమానంగా ఉంటుంది. భవనం వెనక నుంచి వచ్చిన వారు కొన్ని అడుగుల దూరంలో ఉన్న మూడో అంతస్థులోకి దూకాలని ప్రయత్నించారు. సత్యానంద్ భవనంలోకి దూకలేక, పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌పై నిద్రపోయాడు. అప్పటికే మత్తులో ఉన్న ప్రేమ్‌సాగర్ దూకే ప్రయత్నంలో కాలు జారి సుమారు 15 అడుగుల లోతు ఉన్న సెల్లార్‌లో పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది.
తెల్లవారుజామున గమనించిన వాచ్‌మన్ ప్రేమ్‌సాగర్‌ను పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న సత్యానంద్ పక్కన పడుకోబెట్టి 108 కి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది, ప్రేమ్‌సాగర్ మరణించినట్లు తేల్చారు. ఇదంతా సీసీ ఫుటేజీలో నిక్షిప్తమై ఉండటంతో కేసు చిక్కుముడి వీడింది.