ఆ నాలుగు జిల్లాల్లో సడలింపులపై ఉత్కంఠ

తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో 8 గంటలపాటు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు వంటి అంశాలపై ఎంతో సుదీర్ఘ సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నో విషయాలను ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సోమవారం రాష్ట్రంలో కేవలం 3 కరోనా పాజిటివ్‌ కేసులే నమోదవడం, 40 మంది కోలుకుని డిశ్చార్జి కావడం శుభసూచకమని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు. ఆ తర్వతా వైద్యశాఖ అధికారులు తాజా పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

అదేవిధంగా తెలంగాణలో ఇప్పటివరకు 1,085 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు తేలిందని, వారిలో 585 మంది కొవిడ్‌-19 నుంచి కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయినట్లు వెల్లడించారు. అలాగే.. ప్రస్తుతం 471 మంది చికిత్స పొందుతున్నారని, 29 మంది మరణించారని వివరించారు. కాగా రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 717 మంది (66.08 శాతం) హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాలవారే ఉన్నారని.. మృతుల్లో కూడా ఈ నాలుగు జిల్లాలకు చెందినవారే 82.21 శాతం మంది ఉన్నారని వివరించారు. గత 10 రోజులుగా నమోదైన కేసుల్లో కూడా ఈ జిల్లాల్లోనే అత్యధిక శాతం నమోదు అయ్యాయని అధికారులు స్పష్టం చేశారు.

అంతేకాకుండా జనాభాశాతం కూడా ఎక్కువగా ఉన్న ఈ నాలుగు జిల్లాల్లో పరిస్థితి ఏమాత్రం బాగాలేదని.. ఇక్కడ లాక్‌డౌన్‌ను ఏమాత్రం సడలించినా కరోనా వైరస్‌ చాలా వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ నివేదికపై మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో విస్తృతంగా చర్చించి ఆంక్షలు కొనసాగించాలా? సడలించాలా? వైరస్‌ వ్యాప్తి ఎక్కువ ఉన్న జిల్లాల్లో ఎలా వ్యవహరించాలి? అనే అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం అందుతుంది. కాగా సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ యోగితారాణా, వైద్యశాఖ సీనియర్‌ అధికారులు పాల్గొని అన్ని విషయాలను సుదీర్ఘంగా చర్చించారు.