నమ్ముకున్న వారికే పెద్ద పీట వేస్తున్న జగన్

those who trust are the big pics

దాదాపు పదకొండేళ్లుగా జగన్ వెంటే ఉంటున్న కె. నాగేశ్వరరెడ్డిని జగన్ తన పీఏగా ఎంపిక చేసుకున్నారు. ఆయన సొంతూరు కడప. వివిధ మీడియా సంస్థల్లో పని చేసిన అనుభవం ఉన్న అతగాడు.. కొన్నేళ్లుగా జగన్ వెంటే ఉంటున్నారు. అంతేకాదు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో కీలకంగా వ్యవహరించిన నాగేశ్వరరెడ్డి.. జగన్ మనసెరిగి పని చేస్తారని చెబుతారు. విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ మీద దాడి జరిగిన సమయంలోనూ యువనేత పక్కనే నాగేశ్వరరెడ్డి ఉన్నారు. వివిధ వర్గాలకు చెందిన వారితో సమావేశాల్ని ఏర్పాటు చేయించటంలో నాగేశ్వరెడ్డికి మంచి పట్టు ఉందని చెబుతారు. జగన్ మూడ్స్ కు తగ్గట్లు రియాక్ట్ అవుతుంటారని చెబుతారు. ఆయన ఎప్పుడేం కోరుకుంటారో నాగేశ్వరరెడ్డి ఇట్టే పట్టేస్తారన్న పేరుంది. జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న నాగేశ్వరరెడ్డికి జగన్ అవకాశం ఇచ్చారని చెప్పాలి. ఇదిలాఉంటే.. పులివెందులలోని సీఎం క్యాంపు కార్యాలయం పీఏగా డి. రవిశేఖర్ ను ఎంపిక చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. పులివెందులకు చెందిన డి.రవిశేఖర్‌ మొన్నటి వరకు వైఎస్‌ జగన్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా ఉండేవారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక పులివెందుల క్యాంపు కార్యాలయంలో పీఏగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తనతో ఎప్పటినుంచో జర్నీ చేస్తున్న వారికే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా చెప్పాలి.