వరుసగా ఒక్క రోజులో మూడు ప్రమాదాలు

వరుసగా ఒక్క రోజులో మూడు ప్రమాదాలు

విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమలో విష వాయువు లీకవడంతోపాటు గురువారం నాడు దేశవ్యాప్తంగా పలు పారిశ్రామిక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వీటిలో 12 మంది మరణానికి దాదాపు 300 మంది అస్వస్థతకు కారణమైన ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీలో జరిగిన ప్రమాదమే తీవ్రమైనది. విష వాయువును నియంత్రించే వ్యవస్థ సరిగ్గా పని చేయక పోవడం వల్లనే ఇంత తీవ్ర ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. నియంత్రణ వ్యవస్థ సరిగ్గా పని చేయక పోవడం అంటేనే మెయింటెనెన్స్‌ సరిగ్గా లేదని అర్థం.దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ తర్వాత తెరచుకున్న పలు పరిశ్రమల్లో మెయిన్‌టెన్స్‌ సరిగ్గా లేక పోవడం వల్లనే ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఎలాగు ఉత్పత్తి లేదుగదా అని, మెయింటెనెన్స్‌ స్టాఫ్‌ను తక్కువగా నియమించడం, వారిపై తగిన ఆజమాహిషి లేక పోవడం ప్రమాదాలకు దారితీసింది.

చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌ జిల్లాలోని పేపరు మిల్లులో విష వాయువు వెలువడడంతో ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు,. నాసిక్‌లోని ఓ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించగా, తమిళనాడులోని నెయ్వేలిలోని ఎన్‌ఎల్‌సి భారత థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో గురువారం నాడే పేలుడు సంభవించి ఎనిమిది మంది కార్మికులు గాయపడ్డారు.సరైన మెయింటెనెన్స్‌ లేక పోవడం వల్ల ఈ ప్రమాదాలు సంభవించాయని బయటకు కనిసిస్తున్నప్పటికీ బయటకు కనిపించని బలమైన కారణం మరోటి ఉంది. పరిశ్రమలను ప్రోత్సహించాలనే తపనతో చట్టాలను సడలిస్తూ రావడం. గురువారం నాడే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పలు పారిశ్రామిక చట్టాను రద్దు చేస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారు. రద్దు చేసిన వాటిలో పలు వృత్తిపరమైన భద్రత, వర్కింగ్‌ కండీషన్స్‌కు సంబంధించిన నిబంధనలు కూడా ఉండడం గమనార్హం. ఇదే తరహాలో మధ్యప్రదేశ్‌ రాఫ్రం కూడా కార్మిక, పారిశ్రామిక చట్టాల రద్దుకు ఉపక్రమించింది.