మంచి నీటి చెరువులో జారిపడి ముగ్గురు చిన్నారులు మృతి

కర్నాటకలో నీటికోసం చెరువులో దిగిన ముగ్గురు  చిన్నారులు మృత్యవాత పడ్డ వైనం కలకలం సృష్టిస్తోంది.  మంచి నీటి కోసం చెరువు వద్దకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాద వశాత్తూ అందులో పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరు తాలూకా రౌడుకుంద గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. నీళ్లు తెచ్చుకొనేందుకు తాజాగా చెరువు వద్దకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు చెరువులో పడి దుర్మరణం పాలయ్యారు. గ్రామంలో ఓ ప్రైవేటు వ్యక్తి చెరువులోంచి నీళ్లు తెచ్చుకొనేందుకు రవికుమార్‌ (12), నాగరాజ్‌ (8), కార్తీక్‌ (7) తోపుడు బండిలో కడవలను పెట్టుకుని తోసుకుంటూ వెళ్లారు. వీరిలో ఒకరు కాలు జారి చెరువులో పడిపోయాడు.

దాంతో అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన మిగతా ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. కాగా పిల్లలు ఎంతసేపటికే ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన పడిన కుటుంబసభ్యులు చెరువ వద్దకు వెళ్లి చూసేసరికి విగత జీవులుగా పడి ఉన్నారు. ఈ ముగ్గురు చిన్నారులు ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. మృతదేహాలకు సింధనూరు ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి ఆ తర్వాత బంధువులకు అప్పగించారు.