ఆంధ్రప్రదేశ్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్

ఆంధ్రప్రదేశ్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మహమ్మారి కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి… కాగా తెలంగాణ రాష్ట్రములో ఇప్పటి వరకు దాదాపుగా 400కి పైగా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యాధికారులు అధికారికంగా వెల్లడించారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో నిన్న రాత్రి వరకు 314 కేసులు నమోదవ్వగా, తాజగా నేడు పూర్తైన కరోనా నిర్ధారణ పరీక్షల వివరాల ప్రకారం ఇప్పటికి ఏపీలో తాజాగా 15 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా నెల్లూరు జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో 6, చిత్తూరులో 3 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ బాధితుల సంఖ్య 329 కి పెరిగింది.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కీలకమైన నిర్ణయాలను కూడా తీసుకుంది. కరోనా బాధితులకు వెంటిలేటర్లు అందించే సహాయార్థం కొన్ని ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చే ప్రైవేట్ ఆసుపత్రుల్లో నుండి వెంటిలేటర్లు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకని వాటికి అద్దె కూడా చెల్లించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుందంట. ఈ మేరకు ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిపినట్లు అధికారులు వెల్లడించారు. ఇకపోతే ఈ మహమ్మారి కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా లేని ప్రాంతాల్లో లాక్ డౌన్ ఎత్తేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.